ఉద్యోగులు వద్దంటున్నా జగన్ ముందుకే-చివరకి ఏమవుతుంది..?
గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయడం ఉద్యోగులను మోసం చేయడమేనంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు.
ఏపీ కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చింది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో GPS బిల్లు ప్రవేశ పెట్టడానికి నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే GPS బిల్లుని చట్టరూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు OPS కోసం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం వారికి సర్దిచెప్పి GPS తీసుకొస్తోంది. ఈ విషయంలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు GPS వద్దంటూ ఆందోళనలు చేసినా ప్రభుత్వం వినలేదు. చర్చల్లో కూడా ఏకాభిప్రాయం రాలేదు. కానీ ప్రభుత్వం పట్టుబట్టి అదే విధానాన్ని తీసుకొస్తోంది. ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. పైగా ఉద్యోగ సంఘాల నేతల్లో కొందరు ప్రభుత్వ నిర్ణయానికి జై కొట్టడంతో వ్యవహారం తేడాకొట్టింది. ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చూపిస్తామంటున్నారు ఉద్యోగులు. GPS విషయంలో రాజీపడేది లేదని తెగేసి చెబుతున్నారు.
మన ప్రభుత్వం వచ్చాక (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) CPS రద్దు చేస్తాం అంటూ ఎన్నికల ముందు ఘనంగా హామీ ఇచ్చిన జగన్ ఆ మాటపై నిలబడ్డారు. అయితే అక్కడే ఉద్యోగులకు చిన్న షాకిచ్చారు. CPS రద్దు చేస్తున్నారు కానీ దాని స్థానంలో (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) OPS మాత్రం తీసుకు రావడంలేదు. ఇక్కడ కొత్తగా (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్) GPS తెరపైకి తెచ్చారు. దీనివల్ల తమకు ఏమాత్రం ఉపయోగం లేదని అంటున్నారు ఉద్యోగులు. అయినా ప్రభుత్వం వారి మాటలు పట్టించుకోవడంలేదు. GPS వల్ల లాభాలున్నాయని అంటోంది. పైగా అది OPS కంటే మెరుగైనది అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ అది నిజంగా మెరుగైన పాలసీ అయినా కూడా తమకు వద్దని అంటున్నారు ఉద్యోగులు. తమకు పాత పెన్షన్ విధానమే కావాలంటున్నారు. దీనికి కేంద్రం ఒప్పుకోవడంలేదని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇది ఎలా అమలవుతుందనేది ఉద్యోగుల లాజిక్.
గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయడం ఉద్యోగులను మోసం చేయడమేనంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రాష్ట్ర ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి పాతపెన్షన్ అమలు చేస్తామని జగన్ మాటిచ్చారని, అది నిలబెట్టుకోకుండా GPS ను కేబినెట్ లో ఆమోదించడం దుర్మార్గం అని తప్పుబట్టారు. ఉద్యోగ సంఘాలు ఎప్పుడు పోరాటానికి పిలుపునిచ్చినా ప్రభుత్వం కుట్ర పూరితంగా అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. 5 సంవత్సరాలు సేవ చేసే ఎమ్మెల్యే , ఎంపీ లకు పెన్షన్ ఇస్తూ 35 సంవత్సరాలు ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరుస్తున్న ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగుల స్టాండ్ ఏంటి..?
ఇప్పటికే పలు కారణాలతో ఉద్యోగులు ప్రభుత్వంపై రగిలిపోతూ ఉన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులెవరూ సంతోషంగా లేరు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులను పెంచడం ద్వారా వారిలో కూడా అసంతృప్తి మొదలైంది. టైమ్ కు జీతాలు పడని కొన్ని డిపార్ట్ మెంట్ లు ఉన్నాయి. ఇటీవలే విద్యుత్ ఉద్యోగులుకు కూడా జీతాలకోసం ఆందోళన మొదలు పెట్టారు. రాగా పోగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే జగన్ హయాంలో మేలు జరిగిందని అంటున్నారు. అయితే వైసీపీ నమ్ముకున్న సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల్లో ఏమేరకు లబ్ధి చేకూరుస్తారనేేదే అసలు ప్రశ్న. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సీపీఎస్ విషయంలో తీవ్ర నిరాశతో ఉన్నారు. సీపీఎస్ రద్దు అనేది తాము కొత్తగా అడగటం లేదని.. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీయే అని.. ఆ హామీ వల్లే అప్పట్లో జగన్ కి ఓటు వేశామని అంటున్నారు ఉద్యోగులు. మేనిఫెస్టో హామీలను అమలు చేయడం లేదని పదే పదే టీడీపీని విమర్శించే వైసీపీ నేతలు.,. సీపీఎస్ విషయంలో ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మధ్యేమార్గంగా తీసుకొచ్చిన జీపీఎస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటున్నారు. ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.