AP Assembly News: ఏపీ అసెంబ్లీలో చిడతల వాయింపు, భజన - స్పీకర్ ఆగ్రహం, ఐదుగురి సస్పెండ్
Amaravati: ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకొని భజన చేశారు. ఇంకొంత మంది చిడతలు వాయించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎమ్మె్ల్యేలు గొట్టిపాటి రవి కుమార్, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు, గణబాబును స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు పలుసార్లు స్పీకర్ తమ్మినేని వారిని హెచ్చరించినా వినకపోవడంతో సస్పెండ్ చేశారు.
అయితే, నేటి (మార్చి 23) ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకొని భజన చేశారు. ఇంకొంత మంది చిడతలు వాయించారు. నిన్నటి సభలో ఈల వేస్తూ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. నేడు చిడతలతో నిరసన తెలుపుతుండడంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చిడతలు వాయించడంపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేని ఎద్దేవా చేశారు. నిన్న విజిల్స్ వేశారని, ఇవాళ చిడతలు వాయించారని.. రేపు సభలో ఏం చేస్తారో? అంటూ వ్యాఖ్యానించారు. సభలో అమర్యాదగా ప్రవర్తించిన టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు.
దీనిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మండిపడ్డారు. చంద్రబాబుకు చిడతలు కొట్టించుకోవడం బాగా అలవాటు అని ఎద్దేవా చేశారు. ఆ అలవాటు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా వచ్చిందని.. చిడతలతో సభలో అమర్యాదగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలానే చేస్తే తండ్రి కొడుకులు 2024 తర్వాత చిడతలు కొట్టుకోవడమే అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
మద్యం బ్రాండ్స్‌కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబే..
ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు చంద్రబాబు ప్రభుత్వమే ఇచ్చిందని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో అన్నారు. ఆయన అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం 240 బ్రాండ్స్‌కు పర్మిషన్ చంద్రబాబే పర్మిషన్ ఇచ్చారని.. ఆయన ఏపీని పరిపాలించడం మన దురదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో కూడా అదే గతి పడుతుందని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో మాట్లాడారు.
మండలిలోనూ టీడీపీ సభ్యుల డిమాండ్
ఇటు శాసన మండలిలోనూ టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగింది. జంగారెడ్డి గూడెం కల్తీ సారాపై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. తమకు సమయం ఇవ్వాలంటూ ఛైర్మన్‌ను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. ఇంతకుముందే వాయిదా తీర్మానం తిరస్కరించిన తరువాత మళ్లీ అదే అంశం తేవొద్దని అన్నారు. ప్రభుత్వం చెప్పే సమాధానం వినకుండా మీరు మాట్లాడదామంటే కుదరదని అన్నారు.