AP Assembly: చంద్రబాబుకు, ఔరంగజేబుకూ తేడా లేదు - అసెంబ్లీలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
బుధవారం (సెప్టెంబరు 21) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడారు. ఎప్పుడైనా పేదల అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశావా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని దగ్గర తీసుకున్న చరిత్ర నీకుందా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం సత్య హరిశ్ఛంద్రుడిని జగన్ రూపంలో చూస్తున్నామని అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో తాము 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నియోజకవర్గం నాంది పలుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పులివెందులకు ధీటుగా కుప్పంలో మెజారిటీ రాబోతోందని జోస్యం చెప్పారు. గతంలో కేవలం దొంగ ఓట్లతోనే చంద్రబాబు ఆరుసార్లు గెలిచారని నారాయణ స్వామి ఆరోపణలు చేశారు. బుధవారం (సెప్టెంబరు 21) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడారు.
ఎప్పుడైనా పేదల అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశావా అంటూ ప్రశ్నించారు. కుప్పం ఎప్పుడొచ్చినా చంద్రబాబు రచ్చ రచ్చ చేస్తాడని అన్నారు. ‘‘చంద్రబాబు, ఔరంగ జేబు ఒక్కటే. ఔరంగ జేబు తండ్రిని జైలులో పెట్టించాడు. ఇప్పుడు చంద్రబాబు మామను వెన్ను పోటు పొడిచాడు. నీ తమ్ముడుని మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశావ్. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. కుల, మతాలను రెచ్చగొట్టే వ్యక్తి. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని మమ్మల్ని సవాల్ విసరడం కాదు. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు బయటికి రాగలవా?
కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలని అడుక్కున్న వ్యక్తి నువ్వు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేసిన నాయకుడు సీఎం జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు గతంలో ఎందుకు చేయలేకపోయావ్? చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకో. నీలో మార్పు రావాలని ఆ దేవుడిని కోరుతున్నా. వైఎస్ జగన్ మీద బురద జల్లడం మానుకోవాలి. నువ్వు వచ్చిన తర్వాత సామాజిక వర్గాల్లో చీలికలు తెచ్చావ్. కమ్మ, రెడ్డి అంటూ విడగొట్టావ్. ఇటీవల ఓ జడ్జి తెలుగు దేశం నాయకుడిలాగా మాట్లాడారు. అభివృద్ధి విషయంలో ఏపీకి న్యాయవ్యవస్థ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ఏపీలో సారాను తీసుకొచ్చిందే టీడీపీ నేతలు. మద్యంపై వచ్చే ట్యాక్సులు, డబ్బులతో వాటి మీద బతికిందే టీడీపీ. నేనేమీ పారిపోను, మద్యంపై చర్చించడానికి ఎప్పుడూ సిద్ధమే. టైమ్ ఇస్తే అన్ని విషయాలు వెల్లడిస్తా’’ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
రోజూ ఏదో ఓ గొడవ - జోగి రమేష్
టీడీపీ నేతలు ప్రతిరోజూ సభలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలకు వారు ఏం సమాధానం చెబుతారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారని, పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. వివాదం చేయడానికి టీడీపీ నేతలు రోజుకో అంశాన్ని ఎంచుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమ ఉంటే అప్పట్లో చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టించారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మాత్రమే ఎన్టీఆర్‌పై నిజమైన ప్రేమ ఉందని అన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్డీఏతో అధికారం పంచుకున్నప్పుడు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జిల్లా పేరు పెట్టామని అన్నారు. ఎన్టీఆర్‌ను గౌరవించిన పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. వైద్య రంగంలో వైఎస్సార్ గొప్ప సంస్కరణలు తెచ్చారని, ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్య భరోసా లభించిందని చెప్పారు.