AP Power Crisis: సరిపడా వనరులు లేక విద్యుత్ కోతలు, తేల్చి చెప్పిన రాష్ట్ర విద్యుత్ సంస్థలు
AP Power Crisis: ఏపీలో డిమాండ్ కు తగ్గ వనరులు లేక విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి.
AP Power Crisis: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కారణాన్ని చెప్పాయి విద్యుత్ సంస్థలు. విధిలేని పరిస్థితుల వల్లే విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని తేల్చి చెప్పాయి. డిమాండ్ కు తగ్గ వనరులు అందుబాటులో లేవని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని సంస్థలు ప్రకటించాయి. పవన విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గడం సమస్యకు ప్రధాన సమస్యగా పేర్కొన్నాయి సంస్థలు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని చెప్పాయి. గత ఏడాది ఇదే సమయానికి ఏపీలో విద్యుత్ వినియోగం 165 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం అది కాస్త రోజుకు 235 మిలియన్ యూనిట్లకు పెరిగిందని తెలిపారు. సుమారు 70 ఎంయూల డిమాండ్ పెరగడంతో దానిని సర్దుబాటు చేసేందుకు కోతలు తప్పక విధించాల్సి వస్తోందని సంస్థలు వివరించాయి.
సీజన్ లో అత్యధికంగా రావాల్సిన పవన విద్యుత్ ఉత్పత్తి కసీనం 30 శాతం కూడా రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు విద్యుత్ సంస్థల అధికారులు చెబుతున్నారు. రోజులో 10 శాతం ఉత్పత్తి మాత్రమే పవన విద్యుత్ నుంచి వస్తున్నట్లు తెలిపారు. కృష్ణానదిలో నీరు లేనందు వల్ల జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొందామన్నా ప్రతిపాదించిన మొత్తంలో కనీసం 10 నుంచి 20 శాతం కూడా లభించడం లేదని చెప్పారు. బొగ్గు కొరత కారణంగా హిందుజా ఉత్పత్తి పడిపోయినట్లు చెప్పుకొచ్చారు. జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొన్ని వార్షిక మరమ్మతుల నిర్వహణలో ఉన్నాయని వెల్లడించారు. ముందస్తు ఒప్పందాల ద్వారా విద్యుత్ కొనడానికి ప్రయత్నిస్తున్నట్లు విద్యుత్ సంస్థలు వెల్లడించాయి.
అధికమైన విద్యుత్ కోతలు
మూడ్రోజుల నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఉక్కపోతకు జనం అల్లాడిపోతున్నారు. రాత్రి వేళలో విద్యుత్ కోతలతో దోమల బెడద ఎక్కువై చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో విపరీతంగా విద్యుత్ కోతలు ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఏం చెప్పాలో తెలియక.. వారు కూడా తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుందో అనేది విద్యుత్ సంస్థల అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.
సమ్మెను విరమించిన విద్యుత్ ఉద్యోగులు
రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులతో రెండ్రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది విద్యుత్ సంఘాల జేఏసీ. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) లో భాగంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఏపీఎస్ పీఈజేఏసీ (APS PEJAC) ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది.