CM Jagan On Industries: విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం
పరిశ్రమల శాఖపై సమీక్షనిర్వహించిన సీఎం జగన్... త్వరలోనే విశాఖలో పెట్టబడుల సదస్సు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
మూడేళ్లలో రాష్ట్రంలో 47,490 కోట్ల రూపాయల పెట్టుబడులను వివిధ పరిశ్రమలు పెట్టాయని... దీని ద్వారా రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. పరిశ్రమల శాఖపై జరిపిన సమీక్షలో ఈ వివరాలను అధికారులు సబ్‌మిట్ చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, పరిశ్రమలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. మూడేళ్లలో గణనీయ పారిశ్రామికాభివృద్ధి సాధించామని సీఎంకు ప్రత్యేక నివేదికను అందించారు అధికారులు.
గడచిన మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన భారీ, అతిభారీ యూనిట్లు 96 కాగా, ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్‌ఎంఈలు 28,247గా తెలిపారు. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు 28,343గా అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిశ్రమల ద్వారా రూ. 47,490.28కోట్లు పెట్టుబడిగా వచ్చాయని తెలిపారు. 2,48,122 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు.
నిర్మాణంలో ఉన్న కంపెనీలు భారీ, అతిభారీ పరిశ్రమలు 61 అయితే పెట్టుబడి రూ.1,51,372 కోట్లని ఈ పరిశ్రమల్లో ఉద్యోగాల సంఖ్య 1,77,147 గా వెల్లడించారు. నిర్మాణ పనులు మొదలు పెట్టనున్న యూనిట్లు సంఖ్య ఐదు కాగా, తద్వారా పెట్టుబడి రూ.1,365.88 కోట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగాల సంఖ్య 8,850గా వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిశ్రమలు 92 ఉన్నాయని... ఈ పరిశ్రమల ద్వారా రూ. 2,19.766 కోట్ల పెట్టుబడులు వస్తాయని.. 3,19,829 మందికి అవకాశాలు రానున్నట్లు తెలిపారు.
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. విశాఖపట్నం – చెన్నై కారిడర్‌లో భాగంగా ఉన్న నక్కపల్లి నోడ్, కాళహస్తి నోడ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు ఈ సందర్బంగా అధికారులు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం అందించాలని కూడ సీఎం సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయని, వీటికి ఎంఎస్‌ఎంఈలు చేదోడుగా నిలవాలన్నారు.
పారిశ్రామిక ప్రోత్సహకాలు ఎంఎస్‌ఎంఈలకు అందేలా చూడాలని, దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఇవ్వాలన్నారు సీఎం జగన్. ప్రోత్సాహకాల కోసం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలనూ చెల్లించామని ఈ సందర్బంగా సీఎం గుర్తు చేశారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం అన్నారు. క్లస్టర్ పద్ధతిలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలని, ఒకే తరహా ఉత్పత్తులు అందిస్తున్న గ్రామాలు కూడా ఉన్నాయి, వీటిని కూడా క్లస్టర్‌గా గుర్తించి, ప్రోత్సహించాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలవాలన్నారు.
ఇండస్ట్రియల్ పార్కుల్లో కాలుష్య నివారణ:
కాలుష్య నివారణలో ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలన్నారు. ఎంఎస్‌ఎంఈలు ఉన్నచోట కాలుష్య జలాలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించటంతోపాటుగా, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో వపనరులు అందించాలని సీఎం చెప్పారు. ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను పారిశ్రామిక వాడల్లో బలోపేతం చేయాలని సూచించారు. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలని, దీని వల్ల పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని నివారించగలుగుతామని జగన్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక వాడల్లో పనిచేసే వారంతా కార్మికులే కాబట్టి, ఆ కార్మికుల ఆరోగ్యాలను, పరిసరాలను, పరసరాల్లో నివాసం ఉండేవారి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు సీఎం.
పారదర్శక పారిశ్రామిక విధానం...అమలు
పారదర్శకంగా పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని, నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలైన్లకు సంబంధించిన, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, నిజాయితీగా చెప్పగలమన్నారు సీఎం జగన్. ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నామని, ఏది చెబుతున్నామో అదే చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఎవ్వరిని మోసం చేసే మాటలు చెప్పడంలేదని, చేసే పనులలో నిజాయితీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయని వివరించారు సీఎం. భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారన్నారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వం పై నమ్మకమే కారణమని తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో భారీగా ఉపాధికల్పన
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభించనుందని జగన్ తెలిపారు. వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూమిని ఈ ప్రాజెక్టులకు వినియోగించాల్సి ఉంటుందన్నారు. అర హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా... ఒక హెక్టర్ కంటే తక్కువ భూమి ఉన్నవారు 70 శాతం ఉన్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి భూములను లీజు విధానంలో తీసుకుని, వారికి ప్రతి ఏటా ఎకరాకు రూ.30వేల డబ్బు చెల్లించేలా విధానం తీసుకు వస్తున్నట్లు తెలిపారు. గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.
ఇథనాల్ తయారీ పై కూడా దృష్టిపెట్టాలి:జగన్
విస్తృతంగా ధాన్యం పండిస్తున్న ఏపీలో బియ్యాన్ని వాడుకుని ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఆయిల్ ఫాం ప్రాసెసింగ్ యూనిట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహణకు సమాయాత్తమవుతున్నామన్న విషయాన్ని అధికారలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.