AP Budget 2023: నవరత్నాలతో సంక్షేమం, పారదర్శక పాలనతో ప్రగతి మార్గం- ఏపీ గవర్నర్ సందేశం ఇదే!
సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం... పారదర్శక పాలనతో ప్రగతి పథంలో రాష్ట్రాన్ని ప్రభుత్వం నడిపిస్తోందని అంటున్నారు గవర్నర్. ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగం పూర్తి వివరాలు ఇవే.
AP Budget 2023: ఐదు కోట్ల మంది ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం ఆ దిశగానే నాలుగేళ్లుగా అనేక అద్భుతాలు సాధించిందన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన సందర్భంగా ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తన స్పీచ్‌లో నాలుగేళ్లుగా ప్రభుత్వం సాదించిన ఫలితాలను సభకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నవరత్నాలతో సంక్షేమ పాలన నడుస్తోందని గవర్నర్ తెలిపారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పథంలో కూడా రాష్ట్రం దూసుకెళ్తోందని పేర్కొన్నారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల సొమ్ము నేరుగా ప్రజలకు చేరిందని వివరించారు. 4 ఏళ్లలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన ఇవ్వగలుగుతున్నామని వివరించారు.
నవరత్నాల అమలుతోపాటు ఎలాంటి అవినీతి తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నట్టు వివరించారు గవర్నర్. డీబీటీ ద్వారా అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులకే సొమ్ములు ఇవ్వడం ఇదో కొత్త ఒరవడిగా అభివర్ణించారు. గ్రామవార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లామన్నారు. లబ్దిదారుల గుర్తంపు కోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని తెలిపారు.
సంక్షేమంతోపాటు వృద్దిలోనూ ఏ మాత్రం తగ్గేదే లేదన్నారు గవర్నర్. వ్యవసాయం, పారిశ్రామిక, సేవాల రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించినట్టు వివరాలు సభకు అందజేశారు. 2020-21 జీఎస్‌డీపీ వృద్ధిరేటులో ఏపీ నెంబర వన్‌గా నిలిచిందన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. నాడు నేడుతో స్కూల్ ఆధునీకరించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసినట్టు సభ దృష్టికి తీసుకొచ్చారు.
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి ఫేజ్‌లో 3669కోట్లతో 15717 స్కూళ్లు ఆధునీకరిస్తే... రెండో ఫేజ్‌లో 8345 కోట్లతో 22345 స్కూళ్లను ఆధునీకరిస్తున్నట్టు వివరించారు. 9900 కోట్లతో 44 లక్షల మంది తల్లులకు 15వేలు చొప్పున అమ్మఒడి అందిస్తున్నామని తెలిపారు.
గవర్నర్ ప్రసంగంలో మరికొన్ని హైలెట్స్
రాష్ట్రంలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని వివరించారు గవర్నర్. కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు. కడపలో ఆర్కిటైక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సాహకర ధోరణిలో ఉందన్నారు గవర్నర్. 2022-23 ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరల్లో 16.22 శాతం సమగ్ర వృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత దరల్లో ఏపీ తలసరి ఆదాయం 2021-22లో 1,92,517 నుంచి 14.02శాతం వృద్ధి రేటుతో 2,19,518లకు చేరిందన్నారు.
"రాష్ట్రంలోని విద్యాసంస్కరణలకు సంబంధించి డిజిటల్ లెర్నింగ్ కీలక అంశంగా ఉంది. అన్ని వర్గాల విద్యార్థలు నేటి సమాజంతో పోటీ పడేలా 690కోట్ల విలువగ 5.20 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేశాం. ఈ ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేసి ఇచ్చాం. వీటిని4.60 లక్షల మంది విద్యార్థులకు, 60వేల మంది ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేశాం. ఆరో తరగతి నుంచి ఆ పై తరగతులకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ప్రవేశ పెట్టాలని చూస్తున్నాం. ఈ ప్యానల్స్‌ను 5,800 పాఠశాలల్లోని 30,213 తరగతి గదుల్లో నెలకొల్పేందుకు ప్లాన్ చేస్తున్నాం. "