Auto Driver Seva Lo Scheme : ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15వేలు జమ- ఆటోల్లో ప్రయాణించిన చంద్రబాబు, పవన్, లోకేష్
Auto Driver Seva Lo Scheme : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త స్కీమ్ ప్రారంభమైంది. ఆటో డ్రైవర్ల ఖాతాల్లో నేడు 15వేలు జమ చేస్తున్నారు.

Auto Driver Seva Lo Scheme : ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు పండగ రోజు. వారి ఖాతాల్లో ప్రభుత్వం 15 వేలు జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించింది ప్రభుత్వం. వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. జిల్లాల్లో మంత్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పథకాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా వారి బాగోగుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
విజయవాడలోని సింగ్‌నగర్‌లోని మానినేని బసవపున్నయ్య స్టేడియండో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆటోలో ప్రయాణించారు. డ్రైవర్లతో మాట్లాడి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలతో కలిగే లాభం గురించి ఆటో డ్రైవర్ల వివరించారు.

డబ్బులు ఖాతాలో పడ్డాయో లేవో చూసుకోవాలని డ్రైవర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. డబ్బులు పడితే సెల్ ఫోన్లల్లో వచ్చిన బ్యాంక్ మెసేజీలను చూపించిన సూచించారు. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరుతున్నాయని సంక్షేమం ఇంటికి చేరుతోందని పేర్కొన్నారు. " ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేసి బుకింగ్ లు వచ్చేలా చేస్తాం. ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తాం. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కోసం పనిచేస్తాం. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం.ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పండి. ప్రజలంతా ఆనందంగా ఉండటమే కూటమికి కావాల్సింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్ధిక సాయం డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయి. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఇవాళ ఆటో డ్రైవర్లు, మాక్సీ క్యాబ్, క్యాబ్ డ్రైవర్లకు పండుగ. గతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డబ్బులన్నీ రిపేర్లకే సరిపోయేవి... జరిమానాలు కూడా వేసి వేధించారు.2024లో జరిగిన ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఈ స్ట్రైక్ రేట్ ఇంకా పెరగాలి. 16 నెలల క్రితం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది." అని అన్నారు.
"2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేశాం. ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా రిపోర్టు చేస్తే ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తాం. స్త్రీశక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మహిళలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి వేదిక వరకూ వచ్చాను. వారి కుటుంబం కష్ట సుఖాలను తెలుసుకున్నాను. గత పాలకులు అస్సలు పట్టించుకోకపోవటంతో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి.రాష్ట్రంలో 23 వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లను తయారు చేశాం. అన్నా క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్నాం. మధ్యాహ్నం పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా గత పాలకులు నడవనీయలేదు. విజయవాడలో 90 శాతం వాహనాలు సీఎన్జీ ఇంధనంతోనే నడుస్తున్నాయి. వచ్చే రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. గతంలో పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారు... జరిమానాలు భారంగా కాకుండా చూస్తాం." అని చంద్రబాబు మాట ఇచ్చారు.
అంతే కాకుండా డ్రైవర్లు కూడా క్రమశిక్షణతో వ్యవరించాలని సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు సహకరించాలని రాష్ట్రాభివద్ధికి తోడ్పడటాలని హితవులు పలికారు. "ఆటో, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించవద్దు... ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. క్రమశిక్షణగా ఉండి, ప్రజలకు సౌకర్యం కల్పించండి. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఆటోలను దశలవారీగా ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర పునర్నిర్మాణం, సుపరిపాలను కేవలం 16 నెలల్లోనే తెచ్చాం. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో అందరికీ ఉచిత ఆరోగ్య భీమా కల్పించాం. 25 లక్షల వరకూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. కేంద్రం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది." అని అన్నారు.
" మన సంస్కృతిలో భాగమైన పండుగల్ని అంతే ఉత్సాహంతో చేసుకోవాలి. 16 నెలల క్రితం వరకూ పరదాలు కట్టుకుని, గోతులు తవ్వారు. ప్రజల్ని భయంలో ఉంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పేదల సంక్షేమంలోనూ డబ్బులు బొక్కేసిన వాళ్లు రాజకీయానికి పనికిరారు. ఇలాంటి దుష్టశక్తులు రాకుండా, ప్రజలకు చెడు జరక్కుండా కాపాడుకోవాలి. అదే మనకు ఈ దసరా, దీపావళి పండుగల పాఠాలు. మనకు ఇక ఈ వైకుంఠపాళి వద్దు. ఆ దుష్టులు మళ్లీ వస్తే అన్నీ పీకేస్తాడు. అందుకే అలాంటి వారి పాలన మనకు వద్దు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధి సాధ్యమవుతుంది" అని చంద్రబాబు తెలిపారు.





















