Minister Botsa Satyanarayana : తెలుగు ప్రజానీకానికి చంద్రబాబే పెద్ద విపత్తు- మంత్రి బొత్స
Minister Botsa Satyanarayana : టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రాబబు హయాంలో ఎప్పుడు కరవు పరిస్థితులే ఉన్నాయని విమర్శించారు.
Minister Botsa Satyanarayana : ఏపీలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కోస్తా జిల్లాల రైతులకు వైసీపీ ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇవేమీ టీడీపీ అధినేత చంద్రబాబుకు కనపడడం లేదన్నారు. టీడీపీ నేతలు వారి అధినేత దారిలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే కానీ జరుగుతున్న వరద సాయం వారి కళ్లపడడం లేదన్నారు. ప్రకృతి విపత్తులు చంద్రబాబు సీఎంగా ఉండగా ఎంత ఎక్కువ సంభవించాయంటే అసలు ఆయనే తెలుగు ప్రజలకు పెద్ద విపత్తు అని బొత్స విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజిత ఏపీలో ఐదేళ్ల టీడీపీ నిర్వాకం చెప్పకనే ఇందుకు నిదర్శనం అన్నారు.
చంద్రబాబు సమయంలో అనావృష్టే ఎక్కువ
చంద్రబాబు మొదట సీఎంగా పనిచేసిన 1995–2004 మధ్యకాలం వరదల కన్నా అనావృష్టే ఎక్కువని మంత్రి బొత్స ఆరోపించారు. 1999 సెప్టెంబర్ ఎన్నికల్లో తెలుగుదేశం రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆర్థిక సంస్కరణలు ఒక పక్క జనం నడ్డి విరిస్తే, తీవ్ర అనావృష్టి ప్రజలను కుదేలయ్యేలా చేసిందన్నారు. ప్రకృతి విపత్తులు పాలకుల చేతుల్లో ఉండవుగాని చంద్రబాబు బాధ్యతా రాహిత్యం, ఉదాసీన వైఖరి వల్ల 2000–2004 కరవు పరిస్థితులు తెలుగునాట విలయతాండవం చేశాయన్నారు. అప్పుడు ప్రజలకు టీడీపీ ప్రభుత్వ సాయం కనిష్ఠస్థాయిలో కూడా అందలేదన్నారు. ఉపాధి కల్పనకు గానీ, రుణభారంతో బలవన్మరణాలకు దిగుతున్న రైతన్నలను ఆదుకోవడానికి గాని చంద్రబాబు చేసిందేంలేదన్నారు. గోదావరి వరదల సమయంలోనూ టీడీపీ సర్కార్ నీటమునిగిన ప్రాంతాల బాధితులకు తక్షణ సాయం చేసింది చాలా తక్కువే అని బొత్స విమర్శించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిన సాయం నామమాత్రమే అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
వైఎస్ హయాంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లు కరువు పరిస్థితులతో అతలాకుతలమైన తెలుగు ప్రజానీకానికి 2004 మే మూడోవారం వైఎస్ నాయకత్వాన కాంగ్రెస్ సర్కారు రావడం ప్రకృతి ఇచ్చిన వరంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ ఆయన ప్రభుత్వం కరవు సాయంపై దృష్టి పెట్టి సామాన్య ప్రజానీకాన్ని, రైతులోకాన్ని అనూహ్యమైన రీతిలో ఆదుకుని కన్నీళ్లు లేకుండా చేశారు. ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులూ ప్రకృతి శాంతించింది. అది కన్నెర చేసిన సమయాల్లో వైఎస్ శరవేగంతో అమలు చేసిన సహాయ చర్యలు ప్రజలకు ఊహించనిరీతిలో ఉపశమనం కలిగించాయి.- మంత్రి బొత్స
బురద చల్లడం మానుకోండి
చంద్రబాబు చివరిసారి సీఎం అయిన విభజిత ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్ తుపానుతో పాటు వరదలు సంభవించినప్పుడు టీడీపీ సర్కారు నుంచి బాధిత ప్రజానీకానికి తక్షణ సహాయ చర్యలు సరిగ్గా చేయలేదన్నారు. ప్రచారార్భాటంతో, విశాఖపట్నంలో తాత్కాలిక మకాంతో చంద్రబాబు చేసినది హడావుడే తప్ప అసలు సాయం చేయలేదన్నారు. 2014లో మూడోసారి సీఎం అయ్యేనాటికి 36 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చే రీతిలో ఎన్నడూ ఆదుకోలేదన్నారు. సీఎం జగన్ వరదబాధితులకు శాయశక్తులా చేస్తున్న సాయంపై ఇకనైనా తెలుగుదేశం బురద చల్లడం మానుకుంటే మంచిదన్నారు.