Pawan Kalyan : ప్రతిపక్షాలను తిట్టడానికి క్యూ కట్టే మంత్రులు, రైతులకు ధైర్యం చెప్పలేరా? - పవన్ కల్యాణ్
Pawan Kalyan : తుపాను బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు పవన్ కల్యాణ్.
Pawan Kalyan : మాండూస్ తుపాను బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సాయం అందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను మరింత దెబ్బతీసిందన్నారు. కోతకు వచ్చిన చేలు, కల్లంలో ఉంచిన ధాన్యం కళ్లెదుట నీటిలో నానిపోతుంటే దైన్యంగా చూస్తున్న రైతులను చూస్తుంటే గుండె భారంగా మారుతోందన్నారు. ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో వరి పంట నీటిపాలైందన్నారు. పత్తి, బొప్పాయి, అరటి తోటలు తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని పవన్ అన్నారు. తుపానుతో తీవ్ర నష్టం జరిగినా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు ధైర్యం చెప్పరని ప్రశ్నించారు. ప్రత్యర్థి రాజకీయపక్షాల నాయకులను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ, ఏ తిట్లు తిట్టాలో స్క్రిప్టులు పంపే తాడేపల్లి పెద్దలు ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండమని తమ నాయకులకు ఎందుకు పంపరని పవన్ ప్రశ్నించారు.
తుపాను బాధిత రైతులకు తక్షణం
— JanaSena Party (@JanaSenaParty) December 12, 2022
ఆర్థిక సహాయం అందించాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/K7TvChXJbB
రైతులను ఆదుకోండి
రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలలో వరి పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిందని పవన్ ఆవేదన చెందారు. లక్షల ఎకరాలలో పంటలు నీట నానుతున్నాయన్నారు.. అందువల్ల తుపాను దెబ్బతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా ఆదుకోవాలన్నారు. సహేతుకమైన పరిహారాన్ని ప్రతి ఎకరాకు చెల్లించాలన్నారు. కల్లంలో తడిసిన ధాన్యాన్ని ఇప్పటికైనా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూరగాయలు, పండ్ల తోటల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదే విధంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు రైతులకు చేతనైనంతగా సాయపడాలని కోరారు. అసహాయస్థితిలో ఎదురుచూస్తున్న రైతుల పక్షాన నిలబడాలని సూచించారు. వారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రైతాంగానికి మానసిక ధైర్యం కల్పించి, సాయం అందకపోతే ప్రజాస్వామ్య రీతిలో ప్రశ్నించాలన్నారు.
తుపాను నష్టంపై చర్యల్లేవు.. కానీ వారాహి రంగు గుర్తొచ్చిందా?
— JanaSena Party (@JanaSenaParty) December 12, 2022
*అన్నదాతలను ఆదుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి అసలు లేదు
*యువతకు జాబ్ కార్డులను నిలిపివేయాలని చెప్పడం దుర్మార్గం
అనకాపల్లిలో మీడియా సమావేశంలో శ్రీ @mnadendla గారు
Link: https://t.co/y2go6moSNG pic.twitter.com/PVjoqQyHWj
తుపాను నష్టంపై చర్యల్లేవు- నాదెండ్ల మనోహర్
మాండూస్ తుపాను బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టకుండా పవన్ వారాహి వాహనం రంగుపై విమర్శలు చేసేందుకు వైసీపీ నేతలు ముందుంటారని జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అపార నష్టం జరిగితే కనీసం సహాయ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం జనసేన పార్టీ వాహనం రంగుపై మాట్లాడడం శోచనీయం అన్నారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం యువతకు ఇవ్వాల్సిన జాబ్ కార్డులను ఇవ్వవద్దని ఆదేశాలు చేయడం చేతగానితనం అని విమర్శించారు. యువతకు న్యాయబద్ధంగా ఉపాధి కార్యాలయాల్లో ఇవ్వాల్సిన జాబ్ కార్డులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. యువతకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. సమస్యలు పక్కదారి పట్టించడానికి మంత్రులు రోజుకో మాటా మాట్లాడుతున్నారన్నారు. పవన్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని ప్రకటించగానే వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు.