Minister Kodali Nani : ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించేందుకే పాదయాత్ర, చంద్రబాబు మాయలో పడొద్దు- మాజీ మంత్రి కొడాలి నాని
Minister Kodali Nani : ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొట్టడానికి అమరావతి రైతులతో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు.
Minister Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. అమరావతిపై ఒక పుస్తకాన్ని తెలుగుదేశం, దాని తోక పార్టీలు ఆవిష్కరించాయని విమర్శించారు. హైదరాబాద్ ను తానే కట్టానని, తాను మొదలు పెట్టిన వాటిని ఎవరూ ఆపలేదని ఆ సమావేశంలో చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు పిచ్చి పరాకాష్ఠకు చేరింది కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని కొడాలి అన్నారు. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నిర్మాణాన్ని చంద్రబాబు మొదలు పెట్టారా? 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు సీఎం అయినప్పుడు హైదరాబాద్ నగరం లేదా? ఆయన హైదరాబాద్ నగర నిర్మాణం మొదలు పెట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు.
మతి భ్రమించిన మాటలు
"హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను భూసేకరణ చేస్తే వైఎస్ఆర్ దాన్ని కట్టారని చంద్రబాబు అన్నారు. నిజానికి ముఖ్య నగరాల శివార్లలో పెద్ద విమానాశ్రయాలు నిర్మించాలని నిర్ణయించిన కేంద్రం, ఆనాడు భూసేకరణ చేయాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాయి. మరి ఇక్కడ చంద్రబాబు భూసేకరణ చేస్తే, బెంగళూరు, చెన్నైలో కూడా ఆయనే సేకరించాడా? అన్నీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబుకు మతి పూర్తిగా భ్రమించింది. ఒకే ఒక్కడు సినిమా డైరెక్టర్ కూడా తనను స్ఫూర్తిగా సినిమా తీశారని మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పగటి వేషగాడి మాదిరిగా మాట్లాడుతున్నారు. "- కొడాలి నాని
గ్రాఫిక్స్ రాజధాని
సీఎం జగన్ చంద్రబాబు ప్రచారం చేసిన అమరావతి గ్రాఫిక్స్ ను కంటిన్యూ చేయాలా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు పిట్టలదొరగా మారి, ప్రజలను మోసం చేసి, అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టి, మరోసారి మోసం చేయొచ్చన్న దురాలోచనతో మళ్లీ అధికారం పొందొచ్చని 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆయన ఒక మోసగాడని ప్రజలు తేల్చి చెప్పారన్నారు. అందుకే 23 సీట్లకు పరిమితం అయ్యారన్నారు. అమరావతిని మహానగరం కింద దేశంలో అన్ని ముఖ్య నగరాలు దిల్లీ, బెంగళూరు, చెన్నై. హైదరాబాద్ లను దాటించి, మొదటి స్థానంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నించారని చంద్రబాబు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న మహానగరాలు అప్పటి మద్రాస్, బాంబే, కలకత్తా అన్నారు. హైదరాబాద్ కూడా ఒక మహానగరంగా ఉందన్నారు.
గ్రాఫిక్స్ తో రైతులకు ఆశలు
చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి అమరావతి రైతులకు ఆశ చూపి మంచి పంటలు పండే భూములను తీసుకున్నారని కొడాలి నాని ఆరోపించారు. రైతులను మభ్యపెట్టారన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, కోకాపేట అంటూ ఏవేవో కబుర్లు చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు. హైదరాబాద్ ను తానే నిర్మించానని చెప్పి, ఇక్కడి రైతుల పొలాలు తీసుకున్నారని విమర్శించారు. అమరావతి కోసం దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు.
పాదయాత్రలతో కోట్లు
"చంద్రబాబు అమరావతి అని చెప్పి ఒక గ్రాఫిక్ రిలీజ్ చేసి, అక్కడి రైతులను మోసం చేసి, వారి పొలాలన్నీ తీసుకున్నారు. ఐదేళ్లు ఒక్క పని కూడా చేయకుండా కబుర్లు చెప్పారు. ఏమన్నా అంటే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి కట్టి, ఏదీ పూర్తి చేయకుండా వదిలేశారు. అలా రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇవాళ పాదయాత్ర అని చెప్పి రైతులను రోడ్ల వెంట తిప్పుతున్నారు. తిరుపతి పాదయాత్రలో రూ.100 కోట్లు వచ్చాయి. అవన్నీ చంద్రబాబుకు ఇచ్చారు. ఇప్పుడు అమరావతి నుంచి అరసవెల్లి వరకు యాత్ర అంటున్నారు. దాని వల్ల కూడా మరో రూ.100 కోట్లు వస్తాయి. అవి కూడా చంద్రబాబుకు ఇస్తారు."- కొడాలి నాని
ఇప్పుడు ఎందుకీ యాత్ర?
ఇప్పుడు పాదయాత్ర ఎందుకు తలపెట్టారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో అల్లర్లు జరిగితే, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు ఆ ప్రాంతాల వారిని రెచ్చగొట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి ఆయన మాయలో పడొద్దని అమరావతి రైతులను కోరుతున్నానని కొడాలి నాని అన్నారు.