CPI Ramakrishna : ఉద్యోగులను జగన్ సర్కార్ బ్లాక్ మెయిల్ చేస్తుంది-సీపీఐ రామకృష్ణ
CPI Ramakrishna : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.
CPI Ramakrishna : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఉద్యోగుల గోడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పట్టించుకోకపోతే ఇంకెవరికి మొరపెట్టుకోవాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్ కు విన్నవించటం నేరమా? అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ అంశాలేవి ప్రస్తావించలేదు కదా! అన్నారు. ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు. సీఎం జగన్ కక్ష సాధింపు, నిరంకుశ విధానాలు ఇకనైనా విడనాడాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం చిత్తశుద్ధి చూపాలన్నారు.
ఇది మమ్మాటికీ ప్రభుత్వ కక్షసాధింపే
"ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రద్దు చేస్తామని ఆ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఏ రకంగా సమంజసం కాదు. ఉద్యోగులకు సాధారణంగా సమస్యలు ఉంటే మంత్రి లేదా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం సహాజం. కానీ మంత్రి, ముఖ్యమంత్రి పట్టించుకోకుండా, ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడుతుంది ప్రభుత్వం. దీంతో ఉద్యోగులు గవర్నర్ తో కలిసి వాళ్ల సమస్యలు చెప్పుకున్నారు. గవర్నర్ తో వాళ్లు సమస్యలు చెప్పుకున్నారే కానీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయలేదు. దీనిపై ప్రభుత్వం కక్షపూరితంగా ఆ సంఘాన్ని రద్దు చేస్తా, సూర్యనారాయణపై యాక్షన్ తీసుకుంటా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది సరైంది కాదు. వైసీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా కక్షసాధింపునకు పాల్పడుతుంది. జీవో నెం.1 విషయంలో ఇలానే పొరపాటు చేశారు. పొలిటికల్ పార్టీలు రోడెక్కకూడదని జీవో తెచ్చారు. అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నారు. అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడం కాదు వాళ్ల సమస్యలు పరిష్కరించాలి. అంతేకానీ ఇలా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడడం సరికాదు" - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘానికి నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా తెలియచేయాలని నోటీసుల్లో జీఏడీ అధికారులు పేర్కొన్నారు. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసుల్లో స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేసినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలున్నా గవర్నర్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించింది. వీరి సమాధానం తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు గత వారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. జీతాలు, పెన్షనల చెల్లింపులో జాప్యం కారణంగా ఉద్యోగులు పడుతున్న ఆర్థిక బాధలను ఆయనకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంలో విఫలమైందని గవర్నర్ తో భేటీ తర్వాత సూర్యనారాయణ రాజ్ భవన్ ఎదుట ఆరోపణలు చేశారు. ఇవి సంచలనం సృష్టించాయి.