CM Jagan : ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల అజెండా- సీఎం జగన్
CM Jagan Review : రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు చేస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణం, మరమ్మతులు చురుగ్గా చేపట్టాలని ఆదేశాలిచ్చారు.
CM Jagan Review : ఏపీలో రోడ్ల నిర్మాణం, నిర్వహిస్తున్న మరమ్మతుల ప్రగతిపై సీఎం వైయస్. జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రహదారులు, భవనాలు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ, నిడా, పురపాలక, పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల పరిధిలో నిర్వహిస్తున్న రోడ్ల మరమ్మతులు, నిర్మాణలపై క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. నాడు–నేడు కింద చేపడుతున్న పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోందని అధికారులను అభినందించారు. పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పూర్తైన వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో
రాబోయే రోజుల్లో కచ్చితంగా ఫలితాలు కన్పించాలని సీఎం జగన్ సూచించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా, గుంతలు లేని రోడ్లను తీర్చిదిద్దాలన్నారు. నివర్ తుపాను కారణంగా కొట్టుకుపోయిన బ్రిడ్జిలు పునర్నించాలని ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాలని చెప్పారు. ఆర్ అండ్ బి పరిధిలో మరమ్మతులు, స్పెషల్‌వర్క్స్ కింద చేపట్టిన పనులు 1168 కాగా, మొత్తంగా 7804 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయని, దీని కోసం రూ.2205 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే 675 పనులు పూర్తి అయ్యాయని సీఎం అన్నారు. మొత్తంగా 62.09 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రూ.1369 కోట్ల విలువైన పనులు పూర్తిచేశామన్నారు. మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టి
నాబార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 233 పనుల కోసం రూ. 2479.61 కోట్ల కేటాయించామన్నారు. ఇప్పటికే రూ.1321.08 కోట్లు ఖర్చుచేశామని అధికారులు తెలిపారు. పంచాతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్మాణం పైనా దృష్టి సారించాలని సీఎం సూచించారు. 1843 రోడ్లకు రూ. 1072.92 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 4635 కి.మీ. మేర రోడ్లను బాగు చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టాలన్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో చురుగ్గా రహదారుల మరమ్మతులు చేపట్టాలన్నారు.
ప్రతిపక్షాల కుట్రలు
జులై 15 కల్లా గుంతలు పూడ్చాలని, జులై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారు. అయినా సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని, ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా నిధులు లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.