CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
CM Jagan Review : రైతులకు కనీస మద్దతు ధర అందాలనే ఉద్దేశంతో మిల్లర్ల ప్రమేయం తొలగించామని సీఎం జగన్ తెలిపారు.
CM Jagan Review : రైతులకు కనీస మద్దతు ధరకు ఒక్క పైసా కూడా తగ్గకుండా అందించాలనే ఉద్దేశంతోనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఎం జగన్ అన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయాన్ని తొలగించామని స్పష్టంచేశారు. ఖరీప్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా ధాన్యం సేకరణ విధానం అమలు తీరును సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ... రైతులకు కనీస మద్దతు ధర తగ్గకూడదనే ఉద్దేశంతో ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్ర తొలగించామన్నారు. ఈ కొత్త విధానం ఎలా అమలవుతుందో గమనిస్తూ సమస్యలు ఉంటే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకోవాలన్నారు. ముందస్తుగానే గోనె సంచులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ధాన్యం సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ధాన్యం సేకరణకు ప్రత్యేక యాప్
ధాన్యం సేకరణ కోసం తయారుచేసిన యాప్‌లో సిగ్నల్ సమస్యలతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని, అలాంటప్పుడు ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సిగ్నల్ ఉన్న ప్రదేశాల్లో ఆ వివరాలను ఆన్‌లైన్‌లోకి అప్లోడ్ అయ్యేలా యాప్ మార్పులు చేసుకోవాలని సూచించారు. అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. రవాణా, కూలీల ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో పారదర్శకత ఉండాలన్నారు. చెల్లింపులు అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ధాన్యం సేకరణ నూతన విధానాన్ని రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్నారు. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందని రైతులకు తెలియజేయాలన్నారు. రైతులకు చెల్లింపులు అత్యంత పారదర్శకంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రత్యక్షంగా నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్ నుంచి రైతులకు డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు
ధాన్యం సేకరణ, కొనుగోలు సమాచారం రైతు భరోసా కేంద్రాల్లో పెద్ద పోస్టర్లు రూపంలో పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో రైతుల్లో అవగాహన కలుగుతుందన్నారు. రైతుల ఫోన్లకు కొనుగోలు సమాచారాన్ని ఆడియో, వీడియో రూపంలో పంపించాలన్నారు. ధాన్యం సేకరణ కోసం అమలుచేస్తున్న నూతన విధానంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్‌ఓపీలను తయారుచేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ ఎస్‌ఓపీలను పాటించేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్‌ఓపీలు ఉండాలని సూచించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కలిగించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎవరైనా మిల్లెట్స్ కావాలని అడిగితే, వాటిని వినియోగిస్తామన్నారు. ఈ సమీక్షలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.