CM Jagan CRDA Meeting : ఇళ్లు లేని వారికి అమరావతిలో పట్టాలు, సీఎం జగన్ కీలక నిర్ణయం
CM Jagan CRDA Meeting : గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఇళ్లు వారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
CM Jagan CRDA Meeting : గుంటూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో ఇళ్లు లేని వారి కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లులేని వారికి అమరావతిలో ఇంటిపట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతిలో 1134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించనున్నారు. మొత్తం 20 లేఅవుట్లలో స్థలాలు కేటాయిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తీరనున్న గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పేదల కల.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 3, 2023
ఇళ్లులేనివారికి అమరావతిలో ఇంటిపట్టాలు
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశం ఆమోదం.
న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు దక్కనున్న ఇళ్లస్థలాలు. #Andhrapradesh #YSJagan pic.twitter.com/QUamcJc8cb
మూడో విడత పేదలందరికీ ఇళ్లు
గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్లపట్టాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడోవిడత కింద వీరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మే నెల మొదటివారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు లేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదు- అమరావతి రైతులు
అయితే రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీఆర్డీఏ వైఖరిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీకి వెళ్లే కరకట్ట పక్కన సీఆర్డిఏకు వ్యతిరేకంగా రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పొలాలపై తమకే హక్కు లేకుండా చేస్తున్న సీఆర్డీఏ సంస్థ వైఖరిని ఖండిస్తున్నామని ఉండవల్లి రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ తీరును వ్యతిరేకిస్తూ ఉండవల్లి రైతులు ఆందోళనకు కూడా చేశారు. రహదారి విస్తీర్ణం పేరుతో పరిహారంతో సంబంధం లేకుండా మీ పొలాలని మేము తీసుకున్నాం అని సీఆర్డీఏ అధికారులు రైతులకి నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మీ పొలాలకు మీకు సంబంధం లేదంటూ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమైన చర్య అని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. VRO రాణి ఇప్పటికే పలువురు రైతులకు ఫోన్లు చేసి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి మీ కులం ఏమిటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారని వాపోయారు. రహదారికి మేము వ్యతిరేకం కాదని, పరిహారం చెల్లిస్తే మేము ఎలాంటి అడ్డంకులు తెలపామని రైతులు మరోసారి స్పష్టం చేశారు. భూములను ప్రభుత్వం అమ్మాలంటే ఒక న్యాయం, రైతు దగ్గర తీసుకోవాలంటే మరో న్యాయమా అని ఉండవల్లి రైతులు ప్రశ్నిస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు మాకు సరైన పరిహారం ఇచ్చే దాకా మా పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు తేల్చి చెప్పారు.