(Source: ECI/ABP News/ABP Majha)
ACA Elections : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమే - విజయసాయిరెడ్డి బంధువులు, సన్నిహితులే పాలకులు !
ఏసీఏ ఎన్నికల్లో అంతా ఏకగ్రీవం కానున్నారు. వీరంతా వీరంతా విజయసాయిరెడ్డి బంధువులు, స్నేహితులు కావడం విమర్శలకు కారణం అవుతోంది.
ACA Elections : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏసీఏలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. మొత్తంగా అపెక్స్ కౌన్సిల్‌లో ఆయన బంధువులు, సన్నిహితులే సన్నిహితులే ఉండటం ఖాయం కావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటి వరకూ ఏసీఏ అధ్యక్షుడిగా పెనాక శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో ఢిల్లీ జైలులో ఉన్నారు. అయితే అదేమీ మరోసారి ఎన్నిక కావడానికి అడ్డంకి కాలేదు. ఆయన తరపున ఆయన సోదరుడు పెనాక రోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యక్షుడిగా తాను కూడా నామినేషన్ వేశారు రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు. శరత్ చంద్రారెడ్డి .. రోహిత్ రెడ్డి సోదరుడు.
ఆరు పదవులు కోసం ఆరు నామినేషన్లు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో అపెక్స్ కౌన్సిల్‌లో ఆరు పదవుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి రమాకాంతరెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆరు పదవులుకు కేవలం ఆరు నామినేషన్లు మాత్రమే దాఖళయ్యాయి. జైల్లో ఉన్న పి.శరత్ చంద్రారెడ్డి తరపున అధ్యక్ష పదవికి నామినేషన్‌ను ఆయన సోదరుడు ఎన్నికల అధికారికి సమర్పించారు. అయన సోదరుడు.. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. అయితే పత్రాల్లో మాత్రం .. పి. రోహిత్ అనే పేరును మాత్రమే చేర్చారు. కార్యదర్శి పదవికి గోపినాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎ.రాకేష్, కోశాధికారికగా చార్టెడ్ అకౌంటెంట్ ఏవీ చలం, కౌన్సెలర్‌గా పురుషోత్తం నామినేషన్లు వేశారు.
విజయసాయిరెడ్డి అల్లుడు, ఆయన సోదరుడు ఉపాధ్యక్షుడు.. అధ్యక్షులు !
మొత్తంగా ఆరు పదవులకు ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందుకే ఈ ఆరుగురు ఏకగ్రీవం ఖాయం. వీరిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు విజయసాయిరెడ్డి బంధువులు కాగా.. మిగిలిన నలుగురూ ఆయనకు అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. ఏకగ్రీవం అయిన విషయాన్ని డిసెంబర్ మూడో తేదీన జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటిస్తారు. ఆ రోజు నుంచే కొత్త కార్యవర్గం బాధ్యతలు తీసుకుంటుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో పదవులు ఇతరులెవరూ పోటీ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, క్రికెటర్ చాముండేశ్వరి నాథ్ వంటి వారు ఏసీఏలో కీలకంగా ఉండేవారు. ఈ సారి వారు కూడా సైలెంట్ అయిపోయారు. గోకరాజు గంగరాజు తప్ప మిగిలిన ఆయన కుటుంబం అంతా వైఎస్ఆర్‌సీపీలో చేరింది.
అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే పదవులు పంపిణీ చేశారన్న విమర్శలు
గతంలో సుప్రీంకోర్టు బీసీసీఐ విషయంలో జస్టిస్ లోథా కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీ నివేదికల ప్రకారం... బీసీసీఐలో చాలా మార్పులు వచ్చాయి. క్రికెట్ పాలనలలో కూడా క్రికెటర్లు ఉండాలని లోథా కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఆ నిబంధనలు.. రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాలకు వర్తిస్తాయా లేవా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఏసీఏ అపెక్స్ కౌన్సిల్‌లో ఎవరికీ క్రికెట్ ఆడిన అనుభవం లేదు.