AP High Court Updates: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు... ఐదుగురిని అరెస్టు చేసిన సీబీఐ
న్యాయమూర్తుల ఫిర్యాదులపై సహకరించడంలేదని సీజేఐ చేసిన వ్యాఖ్యలతో దర్యాప్తు సంస్థల్లో కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై దుష్ర్పచారం చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. రమణ దర్యాప్తు సంస్థలు సహకరించడంలేదని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కింది స్థాయి కోర్టుల న్యాయమూర్తులకు వస్తున్న బెదిరింపులపై దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో దర్యాప్తు సంస్థల్లో కదలిక వచ్చినట్లు కనిపిస్తుంంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది.
శనివారం పి.ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ జులై 9న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని కువైట్ నుంచి వస్తుండగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శనివారం అరెస్టయిన ఆదర్శ్, సాంబశివరెడ్డిలను కోర్టులో ప్రవేశ పెట్టినట్లు సీబీఐ తెలిపింది. ఇప్పటి వరకు 16 మందిపై కేసులు నయోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఈ కేసులో వైసీపీకి చెందిన ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ తెలిపింది. మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని, ఐదుగురిని అరెస్టు చేశామని పేర్కొంది. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌సీ జోషి తెలిపారు.
జార్ఖండ్ డిస్ట్రిక్ జడ్జి హత్యకేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ రమణ..దర్యాప్తు సంస్థలపై ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల భద్రత విషయంలో సీబీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దర్యాప్తు సంస్థ తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. న్యాయమూర్తుల భద్రతకు సంబంధించిన పిటిషన్ పై వారంలోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులపై బెదిరింపులకు సంబంధించిన కేసులపై దర్యాప్తు సంస్థలు స్పందించకపోవడం శోచనీయమని సీజేఐ అన్నారు. దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యంపై ఇంతకన్నా మరిన్ని వివరాలు చెప్పాలనుకోవడంలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ సంస్థలు తక్షణ చర్యలు ప్రారంభించాలని సూచించారు.
జార్ఖండ్ జిల్లా జడ్జి హత్య
గత నెల 28వ తేదీ ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన జార్ఖండ్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ (49)ను ఆటోతో ఢీకొట్టి కొందరు దుండగులు హత్యచేశారు. మొదట ప్రమాదంగా భావించినా.. సీసీ కెమెరా వీడియో పరిశీలించిన తర్వాత ఖాళీగా ఉన్న రహదారిలో ఆటో నేరుగా జడ్జిని ఢీకొట్టడంపై అనుమానాలు రేకెత్తాయి. ధన్బాధ్ లో అనేక మాఫియా హత్యలకు సంబంధించి కేసులో జడ్జి ఆనంద్ ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల బెయిల్ తిరస్కరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ప్రమాదం కాదు హత్యని తేలడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులకు... ఆటో దొంగతనం చేసి హత్యకు వాడినట్లు తెలిపింది. జడ్జి ఆనంద్ హత్య ఘటనను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
Also Read: Amaravati Farmers Protest: అమరావతి ఉద్యమ రైతులు అరెస్టు.. ఎక్కడికక్కడ కొనసాగుతున్న అరెస్టుల పర్వం