AP Employees Unions : జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !
జీతాల బిల్లులు ప్రాసెస్ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వివాదం ప్రారంభమయింది. పని చేయకపోతే క్రమశిక్షణా చర్యలు తీసకుంటామని సజ్జల హెచ్చరించారు. అలా చేస్తేవెంటనే సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జీతాల బిల్లులను క్లియర్ చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. మరో వైపు ప్రభుత్వం ప్రతి రోజూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఖచ్చితంగా జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి చేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయబోమని స్పష్టం చేస్తున్నారు. ఒక్క సారి పీఆర్సీ ప్రకారం జీతాలు ఉద్యోగులు అకౌంట్లలోకి జమ చేస్తే పీఆర్సీ అధికారికంగా అమల్లోకి వచ్చినట్లవుతుంది. ఉద్యోగులు అంగీకరించినట్లవుతుందన్న అభిప్రాయం ఉంది.
అందుకే ఉద్యోగులు తమకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వవొద్దని పాత జీతాల ప్రకారమే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి అదే విజ్ఞప్తి చేశారు. చివరికి చర్చల కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి కూడా అదే చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేయవద్దని పాత జీతాలు ఇచ్చేలా హామీ కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తామంటోంది. ఉద్యోగులు ఇంకా సమ్మె ప్రారంభించ లేదు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగా పని చేయాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కొత్త జీతాలు వెంటనే ప్రాసెస్ చేయకపోతే ఆ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అయితే సజ్జల హెచ్చరికలను ఉద్యోగ సంఘాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఒక్క ఉద్యోగి పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా అప్పటికప్పుడే సమ్మెకు దిగుతామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. న్యాయ పరంగా సంప్రదించి వెంటనే సమ్మె చేస్తామని ప్రకటించారు.
జీతాల బిల్లులను ప్రతీ నెలా ఇరవై ఎనిమిదో తేదీలోలు ట్రేజరీల్లో సిద్ధం కావాలి. వాటిని ప్రభుత్వానికి పంపాలి. అయితే ఈ సారి కొత్త పీఆర్సీ కాబట్టి ఉద్యోగుల సర్వీసును చూసి.. మొత్తంగా లెక్క చూసి జీతభత్యాలు ఖరారు చేసి బిల్లులు పంపాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చేయలేదు. ప్రభుత్వం ప్రతీ రోజూ సర్క్యులర్లు జారీ చేస్తోంది. జీతం ఒకటో తేదీన ఇవ్వాల్సిందేనని అది కూడా పాత జీతమే ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతం ఇస్తామని.. ఉద్యోగులు ప్రాసెస్ చేయాల్సిందేనని అంటోంది. ఉద్యోగులు ప్రాసెస్ చేయకపోతే.. ఫిబ్రవరి ఒకటో తేదీన జీతాలు పడటం అనుమానంగానే ఉందని ఉద్యోగ సంఘ నేతలు భావిస్తున్నారు.