Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళవారం తెల్లవారుజామునే ఇద్దరు ఎమ్మెల్సీల నివాసాలకు పోలీసులు చేరుకున్నారు. అనంతరం తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై నిన్న తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ను అవమానించడం సభ గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం అన్నారు.
అంతేకాదు.. సభా నాయకుడిగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడితో రాజీనామా చేయించాలని, అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పుడు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టుతో ఈ వివాదం మరింత రాజకీయ వేడి పెంచుతోంది. పోలీసులు ఏ కేసుల కింద అరెస్ట్ చేశారు, తదుపరి చర్యలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















