CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
హైదరాబాద్లోని చారిత్రాత్మక మీరాలం చెరువును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జితో పాటు చెరువు చుట్టూ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. నేరుగా క్రేన్ ఎక్కి సీఎం రేవంత్ పనుల తీరును పరిశీలించడం చూసి అధికారులు షాక్ అయ్యారు. ఆ తర్వాత అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత అప్డేట్ కు సంబంధించిన వివరాలను సీఎంకు స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు కలవకుండా పక్కా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో సమీప ప్రాంతాలకు ముంపు ముప్పు లేకుండా నాలాలను విస్తరించి మూసీ నదిలోకి వరద నీరు వేగంగా పోయేలా చూడాలని సూచించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే ఈ మీరాలం చెరువు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా పనులు వేగవంతం చేయాలన్నారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, మధ్యలో ఉన్న ఐలాండ్స్ను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశించారు.
ట్రెండింగ్ వార్తలు






















