IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక ఊహించని విధంగా మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ వెనుకంజతో ఫాలో ఆన్ ఆడిన లంక, చివరి రోజు అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఐదోరోజు ఓవర్ నైట్ స్కోరు 229/6తో ఆట కొనసాగించి, మ్యాచ్ ముగిసే సమయానికి 429/9 స్కోరు నమోదు చేసింది.
యువ బ్యాటర్ సొనాల్ దినూష 133 నాటౌట్ గా నిలిచి లంకను ఆదుకున్నాడు. అతనికి కేశర నువంత చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత బౌలర్ల ఓపికను పరీక్షించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. చివర్లో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.
ఫాలో ఆన్ ఆడుతూ టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే. గతంలో ఇండియాపై ఫాలో ఆన్ ఎదుర్కొన్న 8 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన లంక, కొలంబోలో ఆ చెత్త రికార్డును చెరిపేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడుతూ ఒకే మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన 3వ బ్యాటర్‌గా దినూష చరిత్ర సృష్టించాడు.
ట్రెండింగ్ వార్తలు






















