India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరగనున్న తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్పై నెలకొన్న ఆసక్తి తెరపడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధికారికంగా స్పష్టం చేసింది.
దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా సవాళ్ల దృష్ట్యా ఈ మ్యాచ్ను వాయిదా వేయాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం మొదట డీడీసీఏకు లేఖ రాసింది. విదేశీ ప్రతినిధులు, వీవీఐపీల కదలికలు మరియు బందోబస్తు కారణంగా ఒకే సమయంలో మ్యాచ్ నిర్వహించడం వల్ల సిబ్బందిపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, డీడీసీఏ ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. చర్చల అనంతరం మ్యాచ్ నిర్వహణకు ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "సెప్టెంబర్ 13న అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-అఫ్గానిస్తాన్ తొలి టీ20 అనుకున్న సమయానికే జరుగుతుంది. అవసరమైన అన్ని రకాల భద్రతా ఏర్పాట్లకు పోలీసులు హామీ ఇచ్చారు" అని డీడీసీఏ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు






















