Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు, ఇటీవల జట్టు ఓటములపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో గంభీర్‌ను తప్పించి వీవీఎస్ లక్ష్మణ్ లేదా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాలలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రచారంపై మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ప్రస్తుతం తనకు ఎలాంటి ఆసక్తి లేదని నెహ్రా స్పష్టం చేశాడు. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఒకవేళ భవిష్యత్తులో బిసిసిఐ తనను సంప్రదిస్తే.. ఆ బాధ్యత చేపట్టే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ముఖ్యంగా టీమిండియా కోచ్‌గా వెళ్లే ముందు తన సతీమణి పర్మిషన్ తీసుకోవాలని, ఒకవేళ ఆమెకు చెప్పకుండా ఏదైనా చేస్తే విడాకులు ఇచ్చే ప్రమాదం ఉందని నెహ్రా సరదాగా వ్యాఖ్యానించాడు.
టీమిండియా హెడ్ కోచ్‌గా ఉంటే ఏడాదిలో దాదాపు 8 నుంచి 9 నెలలు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని, ఇది అనుకున్నంత తేలిక కాదని వివరించాడు. ఇక 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటంపై స్పందిస్తూ.. టోర్నీకి ఇంకా 13 నెలల సమయం ఉందని, వారిద్దరూ ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని అభిప్రాయపడ్డాడు.
ట్రెండింగ్ వార్తలు






















