Martin Scorsese Living Legend of Hollywood | 60ఏళ్లు..26 సినిమాలు..హాలీవుడ్ సింగీతం.. స్కార్సెస్సీ | ABP Desam
హాలీవుడ్ ను ఎంతో మంది డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు మకుటం లేని మహారాజుల్లా ఏలారు. కొన్ని ఏళ్ల పాటు తమ ఆధిపత్యం ఇండస్ట్రీపై ఉండేలా తమ అభిమానులు తమను నెత్తిన పెట్టుకునేలా చిత్రపరిశ్రమను రూల్ చేశారు. హాలీవుడ్ అదృష్టమో ఏమో కానీ అతి కొద్ది మంది మాత్రమే దశాబ్దాలుగా హాలీవుడ్ ను సరికొత్త మార్గం వైపు ప్రయాణించేలా చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త రక్తాన్ని ఎక్కించుకున్నట్లు తరాలు మారుతున్నా వెస్ట్రన్ సినిమాను ఏలుతూ ఇప్పటికీ ఇన్ స్పిరేషన్ గా నిలుస్తున్నారు. అలాంటి అతి కొద్ది మందిలో ముందు గుర్తొచ్చే పేరే లివింగ్ లెజెండ్, 60ఏళ్లుగా సినిమాలే శ్వాసగా బతుకుతున్న మార్టిన్ స్కార్సెస్సీ. ఈ వారం హాలీవుడ్ ఇన్ సైడర్... స్కార్సెస్సీ స్పెషల్.
జనరల్ గా పాతికేళ్లు, ముఫ్లై ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటేనే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటాం. కానీ హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ మార్టిన్ స్కార్సెస్సీ మాత్రం 60ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 82ఏట కూడా యాక్టివ్ గా తన క్రియేటివిటీ ని వెండితెరపై ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ఇటాలియన్ అమెరికన్ అయిన స్కార్సెస్సీ 1942 లో న్యూయార్క్ లో పుట్టారు. చిన్నప్పుడు ఆస్తమా ఉండటంతో స్కార్సెస్సీ పేరెంట్స్ ఆయన్ను ఆటలకు వెళ్లనివ్వకుండా క్లోజ్డ్ డోర్స్ లో ఉండమనే వారు. అలా చిన్న పిల్లాడైన స్కార్సెస్సీకి కనిపించిన ఏకైక ప్రపంచం సినిమా. బోర్ కొట్టినప్పుడల్లా థియేటర్స్ లోనే గడిపేవాడు. అలా కొంత ఏజ్ వచ్చేసరికి ఆస్తమా పోయినా సినిమా లేకుండా మాత్రం బతకలేకపోయేవాడు. ప్రత్యేకించి స్కార్సెసీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మన ఇండియన్ లెజండరీ డైరెక్టర్ సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి. భారతీయ చలన చిత్ర చరిత్రలో అతిగొప్ప సినిమా చెప్పే పథేర్ పాంచాలి చూడటంతో ఎక్కడో అమెరికాలో ఉన్న స్కార్సెసీ తన లైఫ్ లో తీస్తే సినిమాలే తీయాలి అయితే డైరెక్టరే అవ్వాలని బలంగా ఫిక్సయిపోయాడు. అపు అనే పిల్లాడి కథను నిజానికి అతి దగ్గరగా డైరెక్టర్ సత్యజిత్ రే చూపించిన విధానం స్కార్సెసీ లైఫ్ పై బలమైన ముద్ర వేసిందని ఆ తర్వాత కాలంలో ఆయనే చాలా సార్లు చెప్పుకున్నారు.
తన తల్లి క్యాథరీన్ ను లీడ్ రోల్ పెట్టి షార్ట్ ఫిల్మ్స్ తీయటం మొదలుపెట్టిన స్కారెస్సీ 1967 లో Who's That Knocking at My Door సినిమాతో డైరెక్టర్ తన కెరీర్ ను ప్రారంభించారు. ఇటాలియన్ నియో రియలిజానికి తన సినిమాల్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే మార్టిన్ స్కార్సెస్సీ...ఆర్ట్ సినిమాలను, కమర్షియల్ ఫార్మాట్ తో బ్లెండ్ చేస్తూ సరికొత్త పంథాను క్రియేట్ చేయటం మొదలుపెట్టారు. స్కార్సెస్సీ ఎక్కువగా యాక్టర్స్ ను రిపీట్ చేయటానికి ఇష్టపడతారు. అంటే తనకు ఓ యాక్టర్ మీద గురి కుదిరితే ఆయన్నే ఎన్ని సార్లైనా హీరోగా పెట్టి సినిమాలు తీస్తారు. అలా రాబర్ట్ డెనిరో అనే యాక్టర్ తన కథలకు సరైన నాయకుడు అని ఫిక్స్ అయిన స్కార్సెస్సీ..ఆయనతోనే సినిమాలు తీయటం స్టార్ట్ చేశాడు. అలా 1973లో మీన్ స్ట్రీట్స్ అనే క్రైమ్ డ్రామా ను రాబర్ట్ డెనిరో, హార్వేలను లీడ్ రోల్ లో పెట్టి తీసిన స్కార్సెస్సీ క్రైమ్ డ్రామాల్లో అప్పటివరకూ లేని సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. తిరిగి 1976లో నియో నాయిర్ సైకలాజికల్ డ్రామా జోన్రాలో తీసిన టాక్సీ డ్రైవర్ అయితే ఇప్పటికీ ఆ జోన్రాలో ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. రాబర్ట్ డెనిరో ను ఓవర్ నైట్ స్టార్ చేసింది ఆ సినిమా. అక్కడి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ లో న్యూయార్క్, న్యూయార్క్, రేజింగ్ బుల్, ది కింగ్ ఆఫ్ కామెడీ, గుడ్ ఫెల్లాస్ లాంటి బాక్సాఫీస్ బొనాంజాలు వచ్చాయి. మొన్నటికి మొన్న కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వరకూ ఈ ఇద్దరి జర్నీ స్టిల్ కొనసాగుతోంది. రాబర్ట్ డెనిరోతోనే పది సినిమాలు తీశారు స్కార్సెస్సీ.
డెనిరో కి కొంచెం ఏజ్ వచ్చిన లీడ్ రోల్స్ చేయటానికి ఓ యంగ్ యాక్టర్ కోసం వెతికిన స్కార్సెస్సీకి ఈసారి లియోనార్డో డికాప్రియో లాంటి యాక్టర్ దొరికాడు. టైటానిక్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టినా డికాప్రియో హీరోగా యాక్సెప్ట్ చేయటానికి ఓవరాక్షన్ చేస్తున్న హాలీవుడ్ ముందు డికాప్రియో ను ఓ పవర్ ఫుల్ యాక్టర్ గా నిలబెట్టారు స్కార్సెస్సీ. 2004లో ది ఏవియేటర్ తో మొదలుపెట్టి, ది డిపార్టెడ్, షట్టర్ ఐలాండ్, ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వరకూ ఐదు సినిమాలకు తనే హీరో. ఇప్పుడు 82 ఏళ్ల వయస్సులో What Happens at Night, The Devil in the White City మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసిన స్కార్కెస్సీ రెండింటిలోనూ డికాప్రియో నే లీడ్ రోల్ కి తీసుకున్నారు.
60ఏళ్లలో 26 సినిమాలు తీసిన స్కార్సెస్సీ..తన సినిమాలతో 101 సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యారు. అందులో 20 సార్లు స్కారెస్సీ సినిమాలకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. డిపార్టెడ్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా మార్టిన్ స్కార్సెసీ కి కూడా ఆస్కార్ అవార్డు దక్కింది. ఎప్పటికప్పుడు కొత్త తరానికి తగ్గట్లుగా ఆలోచిస్తూ నిత్య యవ్వనంతో తన మెదడు బతికేలా చేసుకుంటున్న ఈ క్రియేటివ్ జీనియస్ తన బ్రూటల్ బోల్డ్ హానెస్టీ తో...రా అండ్ రస్టిక్ అప్రోచ్ తో సినిమాలు తీస్తూ నేటికీ రిలవెంట్ గా ఉండగలుగుతున్నారు. మాంత్రికుడు ఎడం చేతిని ఆడియెన్స్ కి చూపిస్తూ కుడి చేత్తో మ్యాజిక్ కి కావాల్సిన ట్రిక్స్ సరంజామా అంతా సెట్ చేసుకున్నట్లు..తెరపై ఓ కథను ఆడియెన్స్ కి చూపిస్తూ మనకు తెలియకుండానే మరో కథను లేయర్ గా నడిపిస్తూ క్లైమాక్స్ కి వచ్చే సరికి దాన్ని రివీల్ చేయటం..అలా ప్రతీసారి ఆడియెన్స్ కి దొరకకుండా డైరెక్టర్ గా 60ఏళ్లుగా వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే వస్తూనే వస్తున్నారు స్కార్సెస్సీ. మన ఇండియాలో సింగీతం శ్రీనివాస రావు ఎలా అయితే వే ఎహెడ్ ఆలోచిస్తూ సినిమాలు తీస్తారో అచ్చం హాలీవుడ్ లో మార్టిన్ స్కార్సెస్సీ కూడా అలానే అనిపిస్తారు.
స్కార్సెస్సీ గొప్పతనం ఏంటో తెలియాలంటే ఆయన తీసిన సినిమాల్లో బాగా మెయిన్ స్ట్రీమ్ సినిమాలైన టాక్సీ డ్రైవర్, రేజింగ్ బుల్, గుడ్ ఫెల్లాస్, ది డిపార్టెడ్, ది ఊల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ సినిమాలు చూడండి నేను చెప్పిదంతా కరెక్టే అని మీరూ ఒప్పుకుంటారు.





















