Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడ్రోజులు వానలు - వాతావరణ కేంద్రం ఇంకా ఏం చెప్పిందంటే?
Weather Report: రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు నుంచి మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather Report: రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు నుంచి మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఉరుములు, మెరుపు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పెద్దపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే పగటి పూటంతా ఎక్కువగా ఉష్ణోగ్రత సాయంత్రం సమయంలో వర్షాలు పడే ఛాన్స్ అధికంగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వెల్లడించారు.
ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
తమిళనాడు నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు తెలంగాణ, ఒడిశాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం అనకాపల్లి, కాకినాడ, ఎస్పీఎస్సార్ నెల్లూరు, కృష్ణా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా కొక్కిరాలపల్లిలో 9.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సామర్లకోటలో 7.8, యలమంచిలో 7.7, కావలిలో 4.6, గుడివాడలో 4.2, మల్లాదిలో 3.7, ఉప్పలపాడులో 3.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.
ఢిల్లీలో వాతావరణం ఇలా..
ఐదు నెలల్లో ఢిల్లీలో అత్యంత స్వచ్ఛమైన గాలి మంగళవారం నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 75కి మెరుగుపడిన తర్వాత పరిస్థితి 'సంతృప్తికరమైన' కేటగిరీలో ఉంది. అంతకుముందు ఢిల్లీలో గతేడాది అక్టోబర్ 11న ఏక్యూఐ 66 కంటే తక్కువగా నమోదైంది. వర్షం, బలమైన గాలులు ఢిల్లీ గాలిని క్లియర్ చేశాయి.