MGM Hospital Issue: ఎంజీఎం ఘటనపై మంత్రి హరీశ్ సీరియస్, వెంటనే సూపరింటెండెంట్‌పై వేటు
Warangal: ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు తీవ్రంగా రావడంతో మంత్రి హరీశ్ రావు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Warangal MGM Hospital Issue: వరంగల్‌లోని ఎంజీఎం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఐసీయూలో ఓ పేషెంట్‌ను ఎలుకలు, పందికొక్కులు కొరికిన ఘటనలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు తీవ్రంగా రావడంతో మంత్రి హరీశ్ రావు (Telangana Health Minister Harish Rao) వెంటనే స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో సూపరింటెండెంట్‌గా చంద్రశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా, పేషెంట్‌ను ఎలుకలు కొరికిన సమయంలో షిఫ్టులో ఉన్న ఇద్దరు వైద్యులపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.
ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికాయనే వార్తలు, ఫోటో బయటకు రావడంతో వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని అప్పుడే ప్రకటించారు. తాజాగా 24 గంటలు గడవక ముందే కారకులపై చర్యలు తీసుకున్నారు.
హన్మకొండ జిల్లా (Hanamkonda District) భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో ఉన్నారు. చాలా రోజులుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు పరిస్థితి మరింత క్లిష్టం కావడంతో నాలుగు రోజుల క్రితమే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital Warangal) చేర్చారు. మొదటి రోజే శ్రీనివాస్ కుడి చెయ్యి వేళ్లను ఎలుకలు కొరికాయి. కుటుంబ సభ్యులు ఈ విషయం డాక్టర్లకు చెప్పడంతో వారు కట్టుకట్టారు. ఇవాళ ఉదయం కూడా ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద కూడా ఎలుకలు కొరికాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలుకలు కొరికేయడంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది. మళ్లీ డాక్టర్లు కట్టుకట్టి వైద్యం చేశారు.
MGM Hospital ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ.. ఎంజీఎం ఆస్పత్రిని (MGM Hospital) సందర్శించారు. అందులో ఎలుకలు విచ్చలవిడిగా తిరిగేందుకు గల కారణాలపై అక్కడి సిబ్బందితో మాట్లాడి ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధితుడైన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిలో డ్రైనేజీ, పారిశుద్ద్య పనులను మెరుగుపర్చాలని అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.