Warangal: ఎంజీఎం మార్చరీలో రాబందులు, పోస్ట్ మార్టం కోసం డబ్బులు డిమాండ్ చేసిన సిబ్బంది !
వరంగల్ లోని ఎంజీఎంలో కాసులు చేతికిరానిదే పోస్ట్ మార్టం చేయలేని పరిస్థితులు ఉన్నాయని గతంలో పలుమార్లు విమర్శలు వచ్చాయి. తాజాగా అలాంటి ఘటన ఏబీపీ దేశం కెమెరాకు చిక్కింది.
- వరంగల్ ఎంజీఎం మార్చరీలో రాబందులు, పోస్ట్ మార్టం చెయ్యాలంటే డబ్బులు డిమాండ్
- ఎంజీఎం మార్చరీలో శవాలపై పేలాలు ఏరుతున్న సిబ్బంది
- పోస్ట్ మార్టం చెయ్యాలంటే డబ్బులు డిమాండ్
- ABP దేశం స్టింగ్ ఆపరేషన్ లో దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగులోకి
వరంగల్ : వరంగల్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (MGM Hospital) లోని మార్చురీలో నయా దందా సాగుతోంది. పేషెంట్స్, వారి బంధువుల కన్నీరు ఆస్పత్రిలోని కొందరు సిబ్బందికి ఆదాయ వనరవుతోంది. కాసులు చేతికిరానిదే పోస్ట్ మార్టం చేయలేని పరిస్థితులు ఉన్నాయని గతంలో పలుమార్లు విమర్శలు వచ్చాయి. మృతదేహాలను బయటకు తీసుకురావడానికీ సమర్పించాల్సి వస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో దీనిపై నాలుగేళ్ల కిందట చర్చ జరిగింది. ఓ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించడానికి రూ.5 వేలు డిమాండ్ చేసిన వీడియో సైతం వైరల్ కావడంతో అప్పట్లో రాష్ట్ర స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు స్పందించారు. తాజాగా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంతా తెలిసినా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. వైద్య సేవలందించాల్సిన వారే దళారులుగా మారడంతో పేషెంట్ల కుటుంబాలు ఎవరికి చెప్పాలో తెలియని అయోమయంలో ఉన్నారు.
వరంగల్ ఎంజీఎం మార్చరీలో ప్రతిరోజూ ఐదు నుంచి పది వరకు శవాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అయితే పోస్టుమార్టానికి వెళ్తున్న శవాలపై డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి దందాకు తెరలేపారు సిబ్బంది. తాజాగా పస్తం శ్రీను అనే వ్యక్తి 5 రోజుల కిందట వరంగల్ - కాజీపేట మధ్య వందేబారత్ ట్రైన్ ఢీ కొని మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చరీకి తరలించారు జిఆర్పీ పోలీసులు. అసలు సమస్య అక్కడే మొదలైంది. 5 రోజుల నుంచి డెడ్ బాడీ ఎంజీఎం మార్చరీలోనే ఉంది. అయితే రూ.15000వేలు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు.
పోస్ట్ మార్టం చెయ్యాలంటే రేటు తప్పనిసరి
వరంగల్ ఎంజీఎం మార్చరీలో సిబ్బందితో పాటు పంచానామ రాసే కానిస్టేబుల్ సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించే డాక్టర్ కు రూ.3500, ఫోటోగ్రాఫర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కోసం రూ. 3500, పోలీస్ కానిస్టేబుల్‌కు రూ. 3500, అంబులెన్స్ పేరుతో రూ.3500 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఘటన ABP దేశం కెమెరాకు చిక్కింది.
పెద్ద మొత్తం లేకుండా ఇంటికి వెళ్లరని ఆరోపణలు!
వరంగల్ ఎంజీఎంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అయితే డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం కోసం రోడ్ ప్రమాదం లో మృతిచెందిన వారు.. పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వారి మృతదేహాలు పోస్ట్ మార్టం కోసం తీసుకొస్తారు. అయితే ఇక్కడి సిబ్బంది రోజుకు రూ. 50వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పోస్టు మార్టం వ్యవహారంలో బాధితుల కుటుంబసభ్యుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ఇక్కడి బాధితులు కోరుతున్నారు.
ఓ బాధితుడు మాట్లాడుతూ.. ఆ సార్ కు డబ్బులు ఇచ్చాం, ఆయనతో పాటు బాడీ బొక్కలు కలెక్ట్ చేసిన సార్‌కు కూడా డబ్బులు ఇచ్చామని బాధితుడు మీడియాకు తెలిపాడు. డబ్బులు కావాలి కావాలి అని డిమాండ్ చేస్తున్నారని, ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఎంతో అంత ఇవ్వాల్సి వస్తోందని బాధితుడు వాపోయాడు. తీసుకున్న అమౌంట్ తన కోసం కాదని, పరిస్థితి అర్థం చేసుకోవాలని ఆస్పత్రికి చెందిన ఓ సిబ్బంది అన్నాడు.