Warangal: నీటి గుంతలో పడ్డ బైక్, తల్లీ కొడుకుల మృతి, ప్రాణాలతో బయటపడ్డ భర్త
Warangal: వరంగల్ జిల్లాలో నీటి గుంతలో పడి తల్లీకొడుకులు మృతి చెందారు.
Warangal: వరంగల్ జిల్లా పరకాల మండలం వెళ్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపు తప్పి నీటి గుంతలో పడటంతో తల్లీ కుమారుడు మృతి చెందారు. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. వరంగల్ జిల్లా శంభునిపేట కు చెందిన రాజేందర్ సమ్మక్క దంపతుల పెద్ద కూతురు రాజేశ్వరిని నర్సక్క పల్లె గ్రామానికి చెందిన తూర్పాటి రమేష్ కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం రాజేశ్వరి 5 నెలల గర్బవతి.
కాగా.. రాజేశ్వరి, భర్త రమేష్, కుమారుడితో కలిసి వరంగల్ లోని హాస్పిటల్ కు వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి స్వగ్రామం నర్సక్క పల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలో వెళ్లంపల్లి శివారులో రోడ్డు మరమ్మతుల కోసం తీసిన భారీ నీటి గుంతలో బైక్ అదుపు తప్పి రమేష్ తో పాటు భార్య, కుమారుడు పడిపోయారు. నీటి ప్రవాహంలో ఈదుకుంటూ రమేష్ బయటపడ్డాడు. రాజేశ్వరి, కొడుకు చోటు మాత్రం నీటిలో మునిగిపోయారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న నర్సక్క పల్లి గ్రామస్తులు నీటిలో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. శుక్రవారం రాత్రి వేళ కుమారుడు చోటు మృతదేహం లభ్యమైంది. శనివారం రోజు ఉదయం రాజేశ్వరి మృతదేహం లభ్యమైంది.
తన కూతురు రాజేశ్వరి, మనవడు చోటు మృతిపై రాజేశ్వరి తల్లి సమ్మక్క అనుమానాలు వ్యక్తం చేశారు. తన కూతుర్ని, మనవడిని అల్లుడు రమేషే చంపాడని ఆరోపించారు. పెళ్లయిన నాటి నుంచి రాజేశ్వరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. పలుమార్లు విడాకులు ఇస్తానని బెదిరించాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త రమేష్ ను అదుపులోకి తీసుకొని ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు.
భార్య, కొడుకును చంపి జైలుకెళ్లాడు, తిరిగొచ్చి ఉరేసుకున్నాడు
ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కిరాతకంగా హతమార్చాడు. ఈ నెల 2వ తేదీన ఆ కిరాతకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ లో ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఏర్పుల ధన్‌రాజ్ అనే వ్యక్తి ఆవేశంతో భార్యా కొడుకులను హతమార్చాడు. భార్య లావణ్య(23)ను సీసాతో పొడిచి, గొడ్డలితో నరికి దారుణంగా చంపాడు. నెలన్నర వయస్సు ఉన్న కొడుకు క్రియాన్ష్ ను నీటి సంపులో పడేసి ఉసురు తీసుకున్నాడు. తల్లిని, తమ్ముడిని అతి కిరాతకంగా చంపుతున్న తండ్రిని చూసి భయపడి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తడంతో రెండున్నరేళ్ల కూతురు ఆద్య ప్రాణాలతో బయట పడింది.
నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్న ధన్‌రాజ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే గత నెలనే ధన్‌రాజ్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కందుకూరు పరిధి జబ్జార్‌గూడ ప్రాంతంలోని తన సోదరి ఇంటి వద్దే ఉంటున్నాడు. కాగా.. రెండు రోజుల క్రితం అనాజ్‌పూర్ లోని తన ఇంటికి వచ్చాడు. బెయిల్ పై వచ్చిన ధన్‌రాజ్ తో మాట్లాడేందుకు బంధువులు, గ్రామస్థులు విముఖత చూపారు. దీంతో ధన్‌రాజ్ ఇంట్లో, బయటా ఒంటరిగా ఉంటూ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం తండ్రి బాలయ్య ఇంటి నుంచి బయటకు వెళ్లగానే.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ధన్‌రాజ్.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.