Mogilaiah Komuramma: బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు ఊహించని గిఫ్ట్! అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
బలగం సినిమాతో వీరి కళ గొప్పతనం అందరికీ తెలిసిన సంగతి తెలిసిందే. ఊరూరా తిరుగుతూ గానం చేసి, వచ్చిన డబ్బుతో వీరు జీవనం సాగిస్తున్నారు.
Balagam Mogilaiah Komuramma: వరంగల్ జిల్లాకు చెందిన కళాకారులు బలగం సినిమా క్లైమాక్స్‌లో తమ పాట ద్వారా ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్గు కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన మొగిలయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు దళిత బందు పథకం ద్వారా మంజూరు అయిన కారును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మొగిలయ్య దంపతులకు అందజేశారు. ఈ సందర్బంగా మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌కు మొగిలయ్య దంపతులను తీసుకొని వచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య శాలువాతో సత్కరించి, దళిత బంధు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. మొగిలయ్య అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తమ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని దళిత బంధు పథకం మంజూరు చేయించిన బోయినపల్లి వినోద్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్ది సుదర్శన్ రెడ్డికి మొగిలయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఎల్‌డీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న రెండు కిడ్నీలు, రెండేళ్లుగా డయాలసిస్
బలగం సినిమాతో వీరి కళ గొప్పతనం అందరికీ తెలిసిన సంగతి తెలిసిందే. ఊరూరా తిరుగుతూ గానం చేసి, వచ్చిన డబ్బుతో వీరు జీవనం సాగిస్తున్నారు. అయితే, ఇటీవల మొగిలయ్య ఆరోగ్యం బాగా క్షీణించి నిమ్స్ ఆస్పత్రిలో కూడా చికిత్స పొందారు. ఆయనకు కిడ్నీ సమస్యలు ఉండడంతో డయాలసిస్ కూడా చేయించకుంటున్నారు.
బుడిగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య బలగం సినిమాలో ఆయన పాట తర్వాత బలగం మొగిలయ్యగా పేరు పొందాడు. ఆయన భార్య కొమురమ్మ. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కష్టాలు చుట్టుముట్టాయి. మొగిలయ్యకు రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో రెండేళ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నారు. బలగం సినిమాతో తాను వెలుగులోకి వచ్చినట్లే తనకున్న జబ్బు కూడా బయటి ప్రపంచానికి తెలిసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలో ఆయన భార్య తమకు సాయం చేయాల్సిందిగా వేడుకున్న వీడియోలు కూడా వచ్చాయి.
ఊరూరా తిరుగుతూ యక్షగానాలు, బుర్రకథలు చెపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మొగిలయ్యకు ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఇదే విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం స్పందించి, అతడి కుటుంబానికి అండగా నిలిచింది. ఉన్నతాధికారులతో మాట్లాడి దళిత బంధు పథకం కింద మొగిలయ్యను ఎంపిక చేశారు.