Double Bedroom House: గుడ్ న్యూస్ - లబ్దిదారులకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు: మంత్రి తలసాని
సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం రెండవ విడత కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
- 3.38 లక్షల లబ్దిదారులకు గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రణాళిక
- గొర్రెల యూనిట్ వ్యయం 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంపు
- ప్రతి జిల్లాలో గొర్రెల పంపిణీకి రవాణా టెండర్లు చేపట్టాలి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
- ప్రతి గొర్రెకు భీమా సౌకర్యం, జియో ట్యాగింగ్ చేయాలి
- కంటి వెలుగు క్రింద 97 లక్షల మందికి కంటి పరీక్షల నిర్వహణ
- ఏప్రిల్ 30 వరకు జీఓ నెంబర్ 58, 59 క్రింద నూతన దరఖాస్తుల ఆహ్వానం
- భూముల క్రమబద్ధీకరణ కు కటాఫ్ తేది 2020 జూన్ 02 వరకు పొడగింపు
- డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరితగతిన లబ్దిదారుల కేటాయింపు పూర్తి చేయాలి
వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం రెండవ విడత కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రెండవ విడత గొర్రెల పంపిణీ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూముల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
గొర్రెల పంపిణీ
రాష్ట్రంలో ఉన్న గొల్లకుర్మలకు, యాదవులకు 75% సబ్సీడితో గొర్రెల యూనిట్ పంపిణీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ 2017 లో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారని, రాష్ట్ర వ్యాప్తంగా 7.31 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 50 శాతం మొదటి దశలో పంపిణీ పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం రెండవ విడత గొర్రెల పంపిణీ క్రింద పెండింగ్ లో ఉన్న 3.38 లక్షల మంది గొర్రెల యూనిట్ల పంపిణీ జరుగుతుందని అన్నారు.
గొర్రెల యూనిట్ వ్యయాన్ని ప్రభుత్వం 1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచిందని, వీటిలో 25 శాతం అంటే 43 వేల 750 రూపాయలు లబ్దిదారుడి వాటా, మిగిలిన ఒక లక్షా 31 వేల 250 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తుందని, జిల్లాలో ఉన్న లబ్దిదారులతో అవగాహన సమావేశాలు నిర్వహించి లబ్దిదారుల నుండి వాటా సేకరించాలని మంత్రి తెలిపారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి సమీపంలో ఉన్న మార్కెట్ లను మ్యాపింగ్ చేయడం జరిగిందని, ప్రతి జిల్లా నుంచి సీనియర్ స్థాయి అధికారిని నియమించి గొర్రెలను కోనుగోలు చేయాలని అన్నారు. ప్రతి గొర్రెకు భీమా సౌకర్యం, జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందని, ప్రతి జిల్లాలో వెంటనే గొర్రెల రవాణా కోసం టెండర్లు చేపట్టాలని తెలిపారు. ప్రతి జిల్లాలో గొర్రెల కోనుగోలుకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, కలెక్టర్ ల ఆధ్వర్యంలో పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.
అనంతరం కంటి వెలుగు అంశంపై రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల్లో 97 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 15.65 లక్షల రీడింగ్ కళ్ళద్దాలను పంపిణీ చేశామని, 12.18 లక్షల ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేయగా, జిల్లాలకు 7.4 లక్షల పైగా ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు చేరాయని సీఎస్ తెలిపారు. జిల్లాలకు చేరిన ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు త్వరితగతిన లబ్దిదారులకు వారి ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ సూచించారు. కంటి వెలుగు శిబిరాల నాణ్యత నిరంతరం పరిశీలించాలని, జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలని అన్నారు.
ఆరోగ్య మహిళతో మహిళలకు పరీక్షలు
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 22 వేల 333 మహిళలు పరీక్షలు నిర్వహించి 1132 మంది తదుపరి చికిత్స కోసం రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు . ఆరోగ్య మహిళా కార్యక్రమం పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని, రిఫరల్ ఆసుపత్రిలో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని, మహిళలకు పూర్తి చికిత్స ప్రాధాన్యతతో ఉచితంగా అందిస్తామని అన్నారు.
ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా 8 విభాగాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఆరోగ్యం మెరుగు పడే అవకాశం ఉందని, జిల్లాలో మెప్మా, మహిళా సంఘాలు, ఏఎన్ఎం,ఆశా లో ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని, భవిష్యత్తులో మరిన్ని పి.హెచ్.సి లలో ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు చేస్తామని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సేకరించి ఖాళీగా ఉన్న భూముల వివరాలను నూతనంగా రూపోందించిన పోర్టల్ లో నమోదు చేయాలని, ఈ పోర్టల్ లో నూతన ఎంట్రీ లు, ఎడిట్, కన్ఫర్మేషన్ విభాగాలు ఉన్నాయని, ఎంఆర్ఓ లు నమోదు చేసిన వివరాలు ఆర్డిఓ ధృవీకరించాలని, ఈ ప్రక్రియ మూడు రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.
భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 58, 59, 76, 118 లకు సంబంధించి పురోగతి పై సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 58 సంబంధించి పెండింగ్ పట్టాల పంపిణీ వారం రోజులో పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కు సంబంధించి క్రమబద్దికరణ రుసుము వసూలు పై శ్రద్ద వహించాలని త్వరితగతిన రుసుం వసూలు పూర్తి చేసి పట్టాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 58,59 కింద దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించాయని, కటాఫ్ తేదీ 2020 జూన్ 02 వరకు పొడగించి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59 లో తిరస్కరణ కు గురైన దరఖాస్తులు మరో సారి రివ్యూ చేసుకోని నూతన నిబంధనల ప్రకారం అర్హత సాధించే వారికి సమాచారం అందించాలని తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లపై నిర్ణయాలు
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల కేటాయింపులో మంచి పురోగతి ఉందని సీఎస్ అభినందించారు. ఏప్రిల్ 15 నాటికి లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ నమోదు పూర్తి చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ...జిల్లా లో ఆరోగ్య మహిళా శిబిరాలలో ప్రతి మంగళవారం స్క్రీన్ టెస్టులు, కాన్సర్, ఇతర సంబంధిత టెస్టులు 150 నుండి 200 మంది మహిళ ల కు స్క్రీనింగ్ నిర్వహిస్తామని అన్నారు. DRDA,మెప్మ అధికారుల తో ఈ కార్యక్రమం ను వేగవంతం చేస్తామని అన్నారు. 2bhk రిపోర్ట్ లను ఏప్రిల్ 15 లోగా అప్లోడ్ చేస్తాము అని అన్నారు.