Dwakara Groups: తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
Dwakra Groups Runam: డ్వాక్రా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రుణాలు మంజూరు చేయనుంది. నాటుకోళ్లు, గేదెలు పెంపకంతోపాటు, ఫౌల్ట్రీఫారం నిర్వహణకు సాయం చేయనుంది
Telangana News: మహిళా సాధికారత దిశగా తెలంగాణ(Telangana) ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, కీలక ప్రాంతాల్లో మహిళా సంఘాల(Dwakra Groups)తో తెలంగాణ వంటకాల అమ్మకం దుకాణాలు ప్రారంభించిన ప్రభుత్వం...గ్రామీణ మహిళల ఆదాయ వనరలు పెంచే దశగా చర్యలు చేపట్టింది. వారితో నాటుకోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయించనుంది. బ్యాంకుల ద్వారా వారికి ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది.
మహిళా సంఘాలకు మహర్ధశ
తెలంగాణ(Telangana)లో మహిళా సంఘాలకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు రుణాలు అందించడం, వడ్డీ రాయితీలతో వారి కాళ్లపై వారు నిలుదొక్కుకునేలా చేయూత అందించిన ప్రభుత్వం...వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మరో కీలక ముందడుగు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళాల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం, పౌల్ట్రీఫారాలు(Poultry Form) ఏర్పాటుతోపాటు పాడి ఉత్పత్తులు, చేపల విక్రయ కేంద్రాలు(Fish Market) ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులతో చర్చించి మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించనుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాకు 500 మంది డ్వాక్రా సభ్యులకు పాడి పశువులు అందజేయనున్నారు. దీనికి నాలుగున్నర కోట్లు ఖర్చు కానుంది. ఒక్కొక్క సభ్యురాలికి ఒకటి లేదా రెండు పాడి గేదెలను అందజేయనున్నారు. దీనికోసం లక్ష రూపాయలు రుణం ఇవ్వనున్నారు. పశువులు మేపుకునేందుకు అనువైన ప్రాంతం ఉన్న వారికే వీటిని మంజూరు చేయనున్నారు.
నాటుకోళ్లు పెంపకం, చేపల అమ్మకం
నాటుకోళ్ల పెంపకం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడానికి ప్రభుత్వం సాయం అందించనుంది. ఒక్కో జిల్లాకు 3 కోట్లతో రెండు వేల డ్వాక్రా గ్రూప్ సభ్యురాళ్లకు నాటుకోళ్లను అందించనున్నారు. దీనికోసం ఒక్కొక్కరికీ 15వేల రూపాయల రుణం అందజేస్తారు. వీటి ద్వారా దాదాపు 100 వరకు నాటు కోళ్ల పిల్లలను తెచ్చి పెంచుకునే అవకాశం ఉంది. వీటితోపాటు కోళ్ల ఫారాలు పెట్టుకునేందుకూ ఆర్థికసాయం చేయనున్నారు. ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఒక్కో యూనిట్‌కు రెండు లక్షల 91వేల రూపాయలు రుణం అందించనున్నారు. సొంతంగా స్థలం ఉండి షెడ్డు వేసుకుని ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే డ్వాక్రా గ్రూప్ సభ్యురాళ్లకు వీటిని మంజూరు చేయనున్నారు. కోళ్ల ఫారం నిర్వహణపైనా వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం రుణం మంజూరు చేయనుంది. పాల విక్రయ కేంద్రాలను(Milk Centers) సైతం మండలానికి ఒకటి చొప్పున మహిళా సంఘాలకు అందజేయనున్నారు. బస్టాండ్లు(Bus Stand), రైల్వేస్టేషన్లు( Railway Stations), సినిమా థియేటర్లు, రైతు బజార్లు ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో యూనిట్‌కు లక్షా 90వేల రూపాయల రుణం ఇవ్వనున్నారు.
గతంలోనూ సాయం
డ్వాక్రా సంఘాలకు ఉమ్మడి ఏపీలోనూ ప్రభుత్వాలు సాయం అందించాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారితో కుట్టుపరిశ్రమలు ఏర్పాటు చేయించారు.అలాగే డ్వాక్వా ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. గేదెలు కొనుగోళ్లు రుణాలు, గొర్రెల పెంపకానికి సాయం వంటివి చేశారు. మళ్లీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేస్తున్నారు.