Warangal: వరంగల్‌లో దూకుడు పెంచిన బీజేపీ.. సరికొత్త వ్యూహాలు, అధిష్ఠానం మద్దతుతో దూసుకెళ్తూ..
బండి సంజయ్ అరెస్ట్ తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారాయి. టార్గెట్ 2023 అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం పావులుకదుపుతుంది.
తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ అడుగులు వేస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టువుగా ఉన్నా జిల్లాలను ఎంచుకుని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి వెనుదన్నుగా ఉన్న వరంగల్ జిల్లాలో ఆ పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఆ నేతల హుడావుడి చూస్తే ముందస్తు ఎన్నికలు ఖాయం అనేలా చర్చ సాగుతుంది. ఇంతకీ ఆ పార్టీ ఏదీ? వరంగల్‌లో రాజకీయాలపై ప్రత్యేక కథనం...
ఉత్తర తెలంగాణ జిల్లాలో కాషాయం దళం కదం తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారాయి. టార్గెట్ 2023 అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం పావులుకదుపుతుంది. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు ఢిల్లీ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయిలో క్యాడర్ ను బీజేపీ సన్నద్ధం చేస్తుంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం ఎలా సాధించారో అదేవిధంగా రానున్న ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని కనబరచేలా కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ప్రజాసమస్యలపై తెలంగాణ బీజేపీ తనదైన శైలిలో స్పందిస్తోంది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై బీజేపీ పార్టీ అధినాయకత్వం గళమెత్తుతోంది. అందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ దూకుడు పెంచింది. తాజాగా వరంగల్‌లో బీజేపీ ఉద్యోగుల సమస్యలపై నిరసన సభ నిర్వహించి ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు బీజేపీ బాసటగా ఉందని సంకేతాన్ని ప్రజలకు పంపారు. వరంగల్ లో నిర్వహించిన నిరసన సభలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రజస్వామ్య దేశంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో అణచివేస్తామని చూస్తే సరికాదని అన్నారు.
వ్యూహత్మక ఎత్తుగడలు వేయడంలో ఢిల్లీ కాషాయ నాయకత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇతర పార్టీలకు ఇస్తున్నారు. ప్రతిరోజు రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని, గ్రామీణ స్థాయి కార్యకర్త వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు కాషాయ నేతలు. గతంలో బీజేపీ గెలిచిన నియోజకవర్గాలపై సైతం కాషాయ దళం ఫోకస్ పెంచింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పరకాల, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట నియోజకవర్గాలలో కార్యకర్తలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గలైనా భూపాలపల్లి, జనగామ, వరంగల్ తూర్పు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాలలో సైతం బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలను కాషాయ దళం వైపు చూసేలా చేయడం కోసం ఆర్ఎస్ఎస్‌తో పాటు బీజేవైఎం, ఏబీవీపీ, టీజీవీపీ లాంటి అనుబంధ సంస్థలను సైతం సమాయాత్తం చేస్తున్నారు. అయితే ఎస్టీ నియోజకవర్గాలలో నెలకొన్న పోడురైతులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి గిరిజన రైతులలో బీజేపీ మార్క్ చూపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
Also Read: TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే