TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ
నేడు (జనవరి 17) మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఆంక్షలపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఓమిక్రాన్ అరంగేట్రంతో తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందులో భాగంగా గతంలో తరహాలో రాత్రి 9 గంటల తర్వాతి నుంచి ఉదయం వరకూ నైట్ కర్ఫ్యూ విధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులను పొడిగించారు. ఈ క్రమంలోనే థియేటర్లు, షాపింగ్ మాల్స్ సహా జనాలు అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయాలని భావిస్తున్నారు. నేడు (జనవరి 17) మధ్యా్హ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశం ఉన్నందున రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.
ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ పోచారం సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రోజువారీ కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నియంత్రణ కోసం చర్యలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, కరోనా పరీక్షలు మరింత సంఖ్యలో చేయడం, వ్యాక్సిన్‌లు ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పర్చడం వంటి చర్యలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అనాథల సంక్షేమం, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు కరవుభత్యం, దళితబంధుకు నిధుల మంజూరు, వంటి అంశాలు అజెండాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపైనా కేబినెట్ చర్చిస్తారని తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి.. శాఖల వారీగా పద్దుల రూపకల్పనపైన కూడా సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగే నేతలను ఎంపిక చేసి ప్రచారానికి పంపే వీలుంది.
Also Read: Telangana: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ.. నెక్ట్స్ ఏంటి ?
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే