Singareni News: సింగరేణిలో ఎన్నికల సందడి - ఛైర్మన్ లేఖతో మొదలైన హడావుడి
Singareni Collieries: సింగరేణి యాజమాన్యం టీబీజీకేఎస్‌ను కొనసాగించడంపై ఇటీవల జాతీయ కార్మిక సంఘాలు సెంట్రల్ లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
Singareni Collieries Company: సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కాలపరిమితి 2019 అక్టోబర్ నెలలో ముగిసింది. అయితే కరోనా కారణంగా ఎన్నికల వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా సింగరేణి యాజమాన్యం టీబీజీకేఎస్‌ను కొనసాగించడంపై ఇటీవల జాతీయ కార్మిక సంఘాలు సెంట్రల్ లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే మూడేళ్లుగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై ఇప్పటివరకు తాత్సారం జరిగినప్పటికీ ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి చైర్మన్ శ్రీదర్ ఎనర్జీ సెక్రటరీకి లేఖ రాయడంతో ఎన్నికలకు సింగరేణి సిద్దమైంది.
ఆరు జిల్లాలో 50 వేల మంది కార్మికులు
సింగరేణి సంస్థ (Singareni Collieries) తెలంగాణలోని ఐదు జిల్లాలో విస్తరించి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి గనులు ఉన్నాయి. వీటిలో 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో సింగరేణి కార్మికులు స్థానిక రాజకీయ పరిస్థితులకు కీలకంగా మారిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు వివిద రాజకీయ పక్షాలకు కీలకంగా మారుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలకు అనుబందంగా ఉన్న కార్మిక సంఘాలను గెలిపించుకునేందుకు నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగడం గమనార్హం. 2017లో జరిగిన ఎన్నికల్లో ఒక్కొ ఏరియాలో భారీ ఎత్తున డబ్బులు, వెండి సామాగ్రి పంపిణీ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార పార్టీ సుమారు రూ.20 కోట్ల మేరకు ఖర్చు చేసిందని మిగిలిన కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.
రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు
1990 నుంచి సింగరేణిలో Singareni Collieries గుర్తింపు సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. 2003 వరకు జరిగిన ఎన్నికలు ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించారు. అయితే 2003 తర్వాత నాలుగేళ్ల కాలపరిమితి పెంచారు. 2017 ఎన్నికల అనంతరం రెండేళ్ల కాలపరిమితి విదిస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అనివార్యంగా మారాయి. సింగరేణి వ్యాప్తంగా ప్రధానంగా టీఆర్‌ఎస్ అనుబంద సంఘమైన టీబీజీకేఎస్, కాంగ్రెస్ అనుబంద సంఘమైన ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంద సంఘమైన ఏఐటీయూసీ, సీపీఎం అనుబంద సంఘమైన సీఐటీయూ, బీజేపీ అనుబంద సంఘమైన బీఎంఎస్‌తో స్వతంత్ర సంఘంగా ఉన్న హెచ్‌ఎంఎస్‌లు పట్టు కలిగి ఉన్నాయి. తెలంగాణలో కీలకంగా ఉన్న సింగరేణి ప్రాంతంలో పట్టు సాదించేందుకు సింగరేణి ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్న రాజకీయ పార్టీలు కసరత్తులు ప్రారంబించాయి.