కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మున్సిపల్ ఛైర్మన్ సంపత్, వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తక్కుగూడ సభకు గ్రౌండ్ ఇవ్వకపోయినా, హోటళ్లను ఇవ్వకుండా కుట్రలు చేసినా విజయభేరి సభ విజయవంతమైందన్నారు. 86 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులకే బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చన్న రేవంత్ రెడ్డి, ప్రజలకు స్వేచ్ఛ, గౌరవం లేదన్నారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్, మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మున్సిపల్ ఛైర్మన్ సంపత్, వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. కీలకనేతలు త్వరలోనే కాంగ్రెస్ చేరి, పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ప్రజలకు తక్షణ అవసరమన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అన్నివర్గాల వారు స్వేచ్ఛగా జీవించవచ్చన్నారు.
మరోవైపు కాంగ్రెస్‌లో చేరే వారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుకుకుంటున్నారని అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పండిదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌తో తమకు రక్షణ లేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. సీఈసీ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత రెండో విడత జాబితా విడుదల అవుతుందన్నారు. ఓబీసీలు కాంగ్రెస్‌తో ఉన్నారని, మున్ముందు మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. 50 శాతానికి పైగా సీట్లు తొలి విడత లిస్ట్‌లోనే ఉంటాయని, త్వరలోనే మొదటి విడత జాబితాను విడుదల చేస్తామన్నారు మాణిక్ రావ్ ఠాక్రే.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ, 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 49 అసెంబ్లీ స్థానాల్లో ఎవరికి సీటు ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు జరుపుతోంది. 30 నియోజకవర్గాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. మిగిలిన 40 సీట్లలో పార్టీ సర్వే, జన బలం ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 70 మంది అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ...హైకమాండ్ అందజేసింది. జాబితాను పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు...హస్తినకు క్యూకడుతున్నారు.
అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఢిల్లీలో వరుసగా రెండోరోజుల పాటు సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. గురువారం భేటీలో 35 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కమిటీ... శుక్రవారం ఐదు గంటల పాటు సమావేశమైంది. మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయడంతోపాటు 30 సీట్లకు వడపోత పూర్తి చేసింది. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రజాక్షేత్రంలో బలాబలాలు, సర్వే నివేదికల ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరేసి నేతలను ఎంపిక చేసినట్టు తెలిసింది.