Telangana Intermediate Board Abolition : తెలంగాణలో ఇంటర్ బోర్డు రద్దు.. రేవంత్ నిర్ణయం వెనుక అసలు సవాళ్లు ఏంటి?
Telangana Education Reforms: 2027-28 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి 10+2 విధానాన్ని తేవాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. సవాళ్లను ఎలా అధిగమిస్తారు?

Revanth Reddy 10+2 Education System Telangana: తెలంగాణ విద్యా వ్యవస్థలో 55 ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన ఇంటర్మీడియట్ బోర్డు ను రద్దు చేసి, సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ బోర్డుల తరహాలో 2027–28 విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా పాఠశాల విద్యాశాఖను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి తర్వాత గ్రామీణ, పేద, ముఖ్యంగా బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల్లో దాదాపు 40 శాతం మేర నమోదవుతున్న డ్రాపౌట్లను అరికట్టడం, కార్పొరేట్ జూనియర్ కాలేజీల మార్కుల వేట నుంచి విద్యార్థులకు విముక్తి కలిగించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
ఆచరణలో చాలా సవాళ్లు
విధానపరంగా ఈ సంస్కరణ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆచరణలోకి వచ్చేసరికి అడుగడుగునా పెను సవాళ్లు పొంచి ఉన్నాయి. రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలు, సరిపడా తరగతి గదులు, ప్రయోగశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 11, 12 తరగతులను పాఠశాలల్లో విలీనం చేస్తే, ఆ స్థాయి విద్యార్థులకు అవసరమైన సైన్స్ ల్యాబ్‌లు, అదనపు గదులు, క్రీడా మైదానాలను కేవలం ఒక్క ఏడాది వ్యవధిలో యుద్ధప్రాతిపదికన సమకూర్చడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారనుంది.
ప్లస్ టు చెప్పడానికి లెక్చరర్లు ఎలా?
అన్నింటికంటే క్లిష్టమైన సమస్య ఉద్యోగ, సర్వీస్ నిబంధనల వివాదం . పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్లు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలోని జూనియర్ లెక్చరర్ల సర్వీస్ రూల్స్, వేతన స్కేళ్లు, పదోన్నతుల ప్రక్రియ పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండు విభాగాలను విలీనం చేస్తే సీనియారిటీ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే జూనియర్ లెక్చరర్ల సంఘాలు ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. వారి ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని సీఎం హామీ ఇచ్చినప్పటికీ, న్యాయపరమైన చిక్కులు లేకుండా సర్వీస్ నిబంధనలను ఏకీకృతం చేయడం అధికారులకు కత్తిమీద సాములాంటిదే.
ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఏమవ్వాలి?
మరోవైపు, దశాబ్దాలుగా రాష్ట్రంలో సమాంతర విద్యా సామ్రాజ్యాన్ని నడుపుతున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల లాబీ ఈ మార్పును అంత సులభంగా అంగీకరించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వ్యాపారంతో నడుస్తున్న ఈ కార్పొరేట్ కళాశాలలు, 11, 12 తరగతులను పాఠశాలల్లో విలీనం చేస్తే తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే, ఇంటర్ మార్కుల ఆధారంగా జరిగే ఎప్‌సెట్ , జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సన్నద్ధతకు, నూతన 10+2 సిలబస్‌కు మధ్య సమన్వయం సాధించడం కూడా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది.
సవాళ్లను అధిగమించడానికి రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
ఈ పెను సవాళ్లను అధిగమించడానికి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ముందుగా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ప్రధాన ఉన్నత పాఠశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరహాలో అప్‌గ్రేడ్ చేస్తూ, దశలవారీగా 11, 12 తరగతులను ప్రవేశపెట్టడం ఉత్తమ మార్గమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, వారి సర్వీస్ రూల్స్‌కు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ ఏకాభిప్రాయం సాధించడం ద్వారా ఉద్యమాలను నివారించవచ్చు. 55 ఏళ్ల వ్యవస్థను రాత్రికి రాత్రే తుడిచిపెట్టేయడం కేవలం జీవోల జారీతో సాధ్యమయ్యే పని కాదు. మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా బడ్జెట్ కేటాయించి, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలను పరిష్కరించి, ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణకు పక్కా మార్గదర్శకాలు రూపొందించినప్పుడే రేవంత్ సర్కార్ తలపెట్టిన ఈ 10+2 విద్యా సంస్కరణ ఆశించిన ఫలితాలను ఇస్తుంది. లేదంటే, విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడే ప్రమాదం పొంచి ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















