Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్! ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు- ఐఎండీ
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
‘‘ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 3) ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. బలమైన గాలులు గంటకు 30 - 40 కిలోమీటర్ల వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాకాలం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఈ వర్షం ఇంకా కొనసాగుతుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు.
తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని వివిధ ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర మరియు కోస్టల్ కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఢిల్లీ వాతావరణం
ఈ వారం ఢిల్లీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆగస్టు 6 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ సహా ఎన్‌సీఆర్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది.