Todays Top 10 News: 


1. సిట్ విచారణ నిలిపివేత

అక్టోబర్ 3వ తేదీ వరకు తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తు నిలిపివేసినట్టు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. లడ్డూ వివాదంపై సుప్రింకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తు నిలిపివేసినట్టు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కాగా ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కల్యాణ్

లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎం చంద్రబాబు తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే తెలిపారని.. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని, ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని అన్నారు. తాను చేస్తుంది కేవలం ప్రాయశ్చిత్త దీక్ష మాత్రమే కాదని.. శాశ్వత పరిష్కారం కోరుతూ చేపట్టిన దీక్ష అని తెలిపారు. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని చెప్పుకొచ్చారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

3. లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్ మరో ట్వీట్

నటుడు ప్రకాశ్ రాజ్.. లడ్డూ వివాదంపై వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ. కదా? .. ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి. జస్ట్ ఆస్కింగ్' అని తన Xలో పోస్టు చేశారు. కాగా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. వరద సాయం విడుదల చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం 14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసింది. రూ.5858 కోట్లు రిలీజ్ చేసింది. ఏపీకి రూ.1036కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు, తెలంగాణకు రూ.416.80 కోట్లు, మహారాష్ట్రకు రూ.1432 కోట్లతోపాటు మిగతా రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. కాగా ఆయా రాష్ట్రాల్లో ఇటీవల భారీ ఎత్తున వరదలు సంభవించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

5. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ 

ఏపీలో ప్రజలకు పౌరసరఫరాల శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండుసార్లు కందిపప్పు ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.67కు చేరింది. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

6. హైదరాబాద్‌లో డీజే సౌండ్స్‌పై నిషేధం

సౌండ్ పొల్యూషన్​తో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న డీజేలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగర పరిధిలో మతపరమైన కార్యక్రమాల్లో డీజే సౌండ్స్‌పై నిషేధం విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. డీజేల కారణంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో వాటిపై నిషేధం విధించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

7. నిలకడగా సూపర్‌స్టార్ ఆరోగ్యం

అస్వస్థతకు గురైన తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రజినీకాంత్‌కు వైద్యులు చికిత్స అందించారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. రజినీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

8. మోసపోయామని దంపతుల ఆత్మహత్య

సింగరేణి సంస్థలో ఉద్యోగం పేరుతో రూ.16 లక్షలు కట్టి మోసపోయామని మంగళవారం పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన హలావత్ రత్నకుమార్, పార్వతీ దంపతులు సింగరేణి ఉద్యోగం పేరుతో రూ.16 లక్షలు ఓ వ్యక్తికి కట్టి మోసపోయామని తెలిసి కలుపు మందు తాగారు. చికిత్స పొందుతూ హైదరాబాద్లో మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. పశ్చిమాసియాలో అల్లకల్లోలం

పశ్చిమాసియాలో  యుద్ధ వాతావరణం నెలకొంది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మృతికి ప్రతీకారంగా ఇరాన్ రెచ్చిపోయింది. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు  ఇజ్రాయెల్‌పై క్షిపణులు వర్షం కురిపించింది. వైమానిక స్థావరాలు, ఆర్మీ క్యాంపులు, వాణిజ్య భవనాలు వంటి ముఖ్య  ప్రాంతాలను టార్గెట్ చేసుకొని విడతల వారీగా దాదాపు నాలుగు వందలకుపైగా మిసైళ్లతో విరుచుకుపడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. రెండో టెస్టులో భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజులు మాత్రమే జరిగిన ఈ టెస్టు మ్యాచులో విజయం సాధించి భారత జట్టు చరిత్ర సృష్టించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాను కేవలం 146 పరుగులకే కుప్పకూల్చి విజయానికి బాటలు వేసుకుంది. దీంతో భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. యసశ్వీ జైస్వాల్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..