India Vs Bangladesh 2nd Test Match Highlights :భారత(India) జట్టు అద్భుతం చేసింది. కేవలం రెండున్నర రోజుల్లోనే టెస్టు మ్యాచ్ గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అది కూడా పాకిస్థాన్(Pakistan) ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్(Bangladesh) పప్పులు.. టీమిండియా ముందు ఉడకలేదు. తొలి రోజు 35 ఓవర్లే పడ్డా... రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినా... వరుణుడు ఆటంకం కలిగించినా.. భారత జట్టు విజయాన్ని ఆపలేక పోయాడు. మ్యాచ్ డ్రా కావడం ఖాయమని అంతా అనుకున్న వేళ.. రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
స్వదేశంలో తామెంత బలమైన జట్టు మరోసారి టీమిండియా నిరూపించింది. కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత బౌలర్లు పంజా విసిరారు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను కేవలం 233 పరుగులకే కుప్పకూల్చిన భారత బౌలర్లు... రెండో ఇన్నింగ్స్ లో మరింత దూకుడు ప్రదర్శించారు. బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 146 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ముందు కేవలం 95 పరుగుల లక్ష్యం నిలిచింది. యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీతో మరోసారి చెలరేగడంతో టీమ్ ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్ ఇలా..
ఓవర్ నైట్ స్కోరు 26/2 వద్ద అయిదో రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్..146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. బంగ్లాను కేవలం 146 పరుగులకే కుప్పకూల్చారు. బంగ్లా బ్యాటర్లలో షద్మాన్ ఇస్లామ్ (50), ముష్ఫికర్ రహీమ్ (37) మినహా ఎవరూ రాణించలేదు. భారత్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్లు తీశారు. దీంతో భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 95 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.యసశ్వీ జైస్వాల్ అర్ధ సెంచరీతో మరోసారి చెలరేగాడు. 51 పరుగులు చేసి జైస్వాల్ అవుటయ్యయాడు. విరాట్ కోహ్లీ 29 పరుగులతో నిలబడ్డాడు. దీంతో కేవలం 17.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. వచ్చే ఎనిమిది టెస్టుల్లో మరో మూడు మ్యాచులు గెలిచినా భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడం ఖాయం.
ఈ విజయం అద్భుతం
మాములుగా అయితే బంగ్లాదేశ్ పై భారత విజయం సాధారణంగా గొప్ప విషయం కాదు. కానీ పాకిస్థాన్ లో గెలిచి భారత గడ్డపై కాలుమోపిన బంగ్లాదేశ్ ను కేవలం రెండున్నర రోజుల్లోనే మట్టి కరిపించడం మాత్రం టెస్టుల్లో భారత ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. రెండు రోజులు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినా.. కఠినమైన వేడి పరిస్థితుల్లో బౌలింగ్ చేసిన తర్వాత తాము విజయం సాధించడం శుభ పరిణామమని బుమ్రా అన్నాడు. కాన్పూర్ పిచ్ చెన్నైలో ఉన్నదానికి పూర్తిగా భిన్నంగా ఉందని బుమ్రా తెలిపాడు. అనుభవం, అంకిత భావంతోనే ఈ విజయం సాధించామని తెలిపాడు. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని.. ఫీల్డ్‌లో, బౌలింగ్‌లో చురుగ్గా ఉన్నాయని బుమ్రా తెలిపాడు.