India Vs Bangladesh 2nd Test Match Highlights : ఐదు రోజుల ఆటలో రెండున్నర రోజు వరుణుడి కారణంగా కొట్టుకుపోగా నాలుగో రోజు ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శించిన టీమిండియా ఐదో రోజు కూడా దాన్ని కొనసాగించింది. నాలుగో రోజు ఆటలో ప్రపంచ రికార్డు స్థాయి బ్యాటింగ్‌తో 9 వికెట్లకు 285 వద్ద డిక్లేర్డ్ చేసిన భారత్ ఐదో రోజు మొదటి సెషన్‌లోనే విజయాన్ని ఖరారు చేసుకుంది. ఓవర్ నైట్ స్కోరు 26 పరుగుల వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాను భారత బౌలర్లు వణికించారు. బంగ్లా తన రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసి అలౌటైంది.
ఐదో రోజు ఆట మొదలైన రెండు ఓవర్లకే అశ్విన్ మొనిముల్ హక్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ షాంతో, షాద్‌మాన్ ఇస్లామ్ జోడీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా భారత బౌలర్ల ముందు చివరకు తలవంచక తప్పలేదు. అర్ధసెంచరీ భాగస్వామ్యం తరువాత అద్భుత బంతితో షాంతోను బౌల్డ్ చేసిన జడేజా.. ఆ జోడీని విడగొట్టాడు. ఆ తర్వాత కాసేపటికే హాఫ్ సెంచరీ చేసిన షాద్‌మాన్‌ను అర్షదీప్ అవుట్ చేయగా.. తర్వాతి ఓవర్లోనే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లిటన్ దాస్ అవుటయ్యాడు. వెంటనే ఆ మరుసటి ఓవర్లోనే జడేజా షకీబ్ అల్ హసన్‌ను కార్టన్ బౌల్డ్ చేశాడు. 9 పరుగులు చేసిన మిరాజ్‌ను బుమ్రా అద్భుత బంతితో వెనక్కి పంపాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా తైజుల్ ఇస్లామ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 వికెట్లు పడడంతో లంచ్ విరామాన్ని అరగంట వాయిదా వేసి ఆట కొనసాగించారు. ముష్ఫికర్ 37 పరుగులతో అడ్డుపడడంతో చివరి వికెట్ దక్కడానికి బౌలర్లు కాస్త శ్రమిచాల్సి వచ్చింది. లంచ్‌కు ముందు చివరి బంతికి బుమ్రా ముష్ఫికర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 3 , అశ్విన్ 3 , బుమ్రా 3 , ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్.. మొత్తంగా ప్రస్తుత వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 53 వికెట్లు పడగొట్టాడు. వరుసగా మూడో సారి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 50 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. జడేజా కూడా మూడు వేల పరుగులు సహా 300 వికెట్ల మైలురాయి సాధించిన మూడో భారత ఆల్‌రౌండర్‌గా, తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కీలకంగా కాన్పూర్ టెస్టు:
టెస్టు ఛాంపియన్ షిప్‌లో భారత్ అద్భుత విజయాలతో దూసుకు వెళ్తోంది. ప్రతి మ్యాచ్ ఇందులో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా అద్భుత విజయాలతో దూసుకొచ్చిన శ్రీలంక భారత్‌కు సవాలుగా మారింది. లంక న్యూజిలాండ్‌పై వరుస టెస్టు విజయాలతో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ తరుణంలో కాన్పూర్ టెస్టు కీలకంగా మారింది. కాన్పూర్ టెస్టు భారత్ డ్రా చేసుకుంటే పాయింట్స్ టేబుల్‌లో తేడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో విజయం తప్ప దేన్నీ కోరుకోని రోహిత్ సేన.. ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శిస్తోంది.
మ్యాచ్‌లో నాలుగో రోజు 233 పరుగులకు బంగ్లాను కట్టడి చేసి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 50 పరుగుల నుంచి 9 వికెట్లకు 289 పరుగులు చేసే వరకు ఐదు ప్రపంచరికార్డులు సృష్టిస్తూ బ్యాటింగ్ కొనసాగించింది. చరిత్రలో ఏ టీం కూడా ఈ స్థాయిలో 35 ఓవర్ల పాటు ఏకధాటిగా ఈ స్థాయిలో విరుచుకు పడింది లేదు. రోహిత్ బాడుతో మొదలైన భారత బ్యాటింగ్‌ను, జైస్వాల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, గిల్ మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాను ఫీల్డింగ్‌కు ఆహ్వానించిన రోహిత్ సేన.. 1962 తర్వాత కాన్పూర్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తొలిజట్టుగా నిలిచింది. గడచిన 9 ఏళ్లలో టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసిన తొలి భారత జట్టుగానూ రికార్డుల్లోకి ఎక్కింది. ఐదు రోజుల ఆటలో తొలి రోజు ఫస్ట్ సెషన్ మాత్రమే జరగ్గా.. ఆ తర్వాత రెండో రోజూ, మూడో రోజు ఆట కూడా వాష్ అవుట్ అయింది.
Also Read: టీమిండియా భవిష్యత్తు "వైభవో"పేతం, 13 ఏళ్లకే సచిన్ రికార్డు చెరిపేసిన చిచ్చరపిడుగు