India vs Bangladesh:  బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ను టీమ్‌ ఇండియా( India) 8 వికెట్ల నష్టానికి  285 పరుగులతో  డిక్లేర్‌ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి 72 పరుగులు, కేఎల్‌ రాహుల్‌ 68 పరుగులు , కోహ్లీ 47 పరుగులతో   రాణించారు.


కాన్పూర్ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. మైదానం తడిగా ఉండటం వల్ల రెండు, మూడు రోజుల్లో ఆట జరగకపోగా, ఎట్టకేలకు నాలుగో రోజు కొనసాగగా... ఒకేరోజు 18 వికెట్లు నేలకొరిగాయి. నాలుగో రోజు 107/3తో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌ 233 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్‌, అశ్విన్‌, ఆకాశ్ దీప్‌ రెండేసి వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.


రికార్డులే రికార్డులు:


ఈ టెస్ట్ లో భారత జట్టు టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా రికార్డులకు ఎక్కింది. 3 ఓవర్లలోనే 50  పరుగులు, 10.1 ఓవర్లలో 100  పరుగులు, 18.2 ఓవర్లలో 150 పరుగులు, 24.4 ఓవరల్లో 200 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది. 


గతంలో అతి త్వరగా వంద పరుగులు చేసిన రికార్డ్ టీం ఇండియాకే ఉండగా... ఇప్పుడు స్వంత రికార్డ్ ను బ్రేక్ చేసింది. అలాగే అతి త్వరగా 200 పరుగులు చేసిన రికార్డ్  ఆస్ట్రేలియా పేరిట ఉండగా ఇప్పుడు అది భారత్ బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, గిల్ ద్వారా ఈ రికార్డులు సాధ్యం అయ్యాయి. అత్యంత వేగంగా 250 పరుగులు చేసిన జట్టుగా కూడా ఈ రోజు రికార్డులలో చోటు సంపాదించుకుంది టీం ఇండియా. 


అలాగే ఒకే  ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇంగ్లాండ్ రికార్డు బ్రేక్ చేసింది. 2022లో ఇంగ్లాండ్ 29 ఇన్నింగ్స్‌ల్లో 89 సిక్స్‌లు చేయగా, ఇప్పుడు 14 ఇన్నింగ్స్‌ల్లో 90 సిక్స్‌లు కొట్టి ఇంగ్లాండ్ రికార్డును టీమ్ ఇండియా బ్రేక్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఈ రికార్డును కైవసం చేసుకుంది.






విరాట్ కోహ్లీ@27,000


టీమ్‌ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 47 పరుగులు చేసిన కోహ్లీ... అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ 34,357... కుమార సంగక్కర 28,016... రికీ పాంటింగ్ 27,483 పరుగులతో ఉన్నారు. కోహ్లీ ప్రస్తుతం 27,012 పరుగులతో ఉన్నాడు.