IND vs BAN, 2nd Test: బంగ్లాదేశ్(Bangladesh) తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా(India) ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. అశ్విన్, జడేజా బౌలింగ్ లో రికార్డులు సృష్టించగా... బ్యాటింగ్లో రోహిత్- యశస్వీ చరిత్ర సృష్టించారు.
అశ్విన్ అరుదైన రికార్డు
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 50కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. మూడు డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ లలో అశ్విన్ 50కుపైగా వికెట్లు తీశాడు. మరోవైపు మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 300 వ టెస్ట్ వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ అయింది.
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- యశస్వీ జైస్వాల్ రికార్డు సృష్టించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన జోడీగా చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో ఈ జోడీ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కేవలం 18 బంతుల్లోనే రోహిత్-యశస్వీ జోడి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. సుదీర్ఘ ఫార్మట్ లో ఇది వేగవంతమైన అర్ధ శతకంగా నిలిచింది.
300 వికెట్ల క్లబ్బులో జడేజా
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్ క్లబ్బులో చేరాడు. 73వ టెస్ట్‌లో జడేజా ఈ మైలురాయిని చేరుకున్నాడు. టెయిలెండర్ ఖలీద్ అహ్మద్ ను అవుట్ చేసిన జడేజా.. 300 వికెట్లక్లబ్బులో చేరాడు. భారత జట్టులో లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619 వికెట్లు), రవిచంద్రదన్ అశ్విన్ (523), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (417), జహీర్ ఖాన్ (619 వికెట్లు) తీశారు. వీరి తర్వాత 300 టెస్టు వికెట్లు తీసిన ఏడో భారత బౌలర్ గా జడేజా నిలిచాడు. ఇషాంత్ శర్మ (311) వికెట్లు తీసి ఈ జాబితాలో ఉన్నాడు. బంతుల సంఖ్య ప్రకారం టెస్టుల్లో 300 వికెట్ల మార్క్‌ను వేగంగా సాధించిన రెండో భారతీయుడుగానూ జడేజా నిలిచాడు.
జడేజా 300 వికెట్లు చేరుకోడానికి 17,428 బంతులు అవసరం అయ్యాయి. ఇది అశ్విన్ 15,636 బంతుల్లో 300 వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు. జడేజా టెస్టుల్లో 4 సెంచరీలు, 21 అర్ధసెంచరీలతో 3122 టెస్ట్ పరుగులను సాధించాడు.