VVS Laxman: ప్రపంచ క్రికెట్‌ను మరో పదేళ్ల పాటు శాసించేంతగా భారత్‌ అమ్ముల పొదిలో ప్లేయర్స్ ఉన్నారని లెజెంటరీ క్రికెటర్‌, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఒక్క పురుషుల జట్టే కాక మహిళా జట్టుకు కూడా ఆ స్థాయి ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారని అన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి మహిళా జట్టుకు కానీ పురుషుల జట్టుకు కానీ కనీసం పాతిక మంది మంచి ఆటగాళ్లు ఎన్‌సీఏ రాడార్‌లో ఉన్నారని చెప్పాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచాన్ని ఏలడానికి ఎప్పటికప్పుడు బెంచ్ అత్యంత సమర్థమైన ప్లేయర్స్‌తో బలంగా మరో పదేళ్లపాటు కనిపిస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశాడు.


అత్యుత్తమ క్రికెటర్ల సప్లై చైన్‌ భారత్‌ సొంతం:


ఒకప్పుడు ఆస్ట్రేలియాకు పీడకలలను మిగిల్చిన జోడీ రాహుల్‌ ద్రవిడ్- వీవీవీఎస్ లక్ష్మణ్‌. 2001 కోల్‌కతా టెస్టులో ఫాలోఆన్‌ నుంచి భారత్‌ను బయటపడేయటమే కాదు ఆ ఉచ్చులోకి కంగారూలనే లాగి వారి అప్రతిహాత విజయాలకు అడ్డుకట్ట వేయడంలో ఈడెన్‌లో వీళ్లిద్దరి మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌ ఎంతో సహాయ పడింది. ఆ తర్వాత నేషనల్‌ క్రికెట్ అకాడమీ హెడ్‌గా మారిన రాహుల్ ద్రవడ్‌ భారత క్రికెట్ యవనికకు మెరికల్లాంటి కుర్రాళ్లను అందించాడు. అతడు భారత్‌ కోచ్‌గా పగ్గాలు అందుకున్న తర్వాత ఆ బాధ్యత తీసుకున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌.. తనదైన ముద్ర చూపిస్తున్నాడు. వీళ్లిద్దరూ నేషనల్‌ క్రికెట్ అకాడమీని ఏ స్థాయిలో తీర్చిదిద్దారంటే భారత్‌ క్రికెట్ బెంచ్‌కు అత్యంత సమర్థులైన ఆటగాళ్ల ప్రవాహాన్ని సృష్టించారు. ఈ కారణంగానే వచ్చే పదేళ్లు భారత్ బెంచ్ అత్యంత బలంగా ఉంటుందని లక్ష్మణ్ అత్యంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాడు.


పురుషుల జట్టే కాదు.. మహిళల జట్టు బెంచ్‌ కూడా అత్యంత బలంగా తయారైంది:


ఎన్‌సీఏ నుంచి బయటకు వచ్చే కుర్రాళ్లు దేశాన్ని గర్వపడేలా చేస్తారని తనకు నమ్మకం ఉందని లక్ష్మణ్ అన్నాడు. పురుషుల టీం మాత్రమే కాదు మహిళా జట్టుకు కూడా సమర్థవంతమైన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారని ఇది కనీసం మరో పదేళ్లు కొనసాగుతుందని చెప్పారు. వెస్టిండీస్‌లో 2024 టీ ట్వంటి ప్రపంచకప్ మాత్రమే కాదు.. అన్ని ఫార్మాట్లలో భారత్‌ ప్రపంచ క్రికెట్‌ను డామినేట్ చేయడం చూస్తున్నామన్నారు. ర్యాకింగ్స్‌ కానీ స్టాట్స్‌లో కానీ భారత క్రికెటర్లే అడ్వాన్స్‌గా ఉన్నారన్నారు. ఇలాంటి సమయంలో తమ కెరీర్ పట్ల గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా వారిని సరైన ట్రాక్‌లో పెట్టడంలో కూడా విజయవంతం అయినట్లు లక్ష్మణ్ చెబుతున్నారు. రాహుల్‌ కోచ్‌గా ఉన్న సమయంలో ఎన్సీఏలో కాంట్రాక్ట్‌లో ఉన్న ప్లేయర్స్ పట్ల కాస్త ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్స్‌తో పాటు అండర్ 19 ప్లేయర్స్‌ను కూడా అన్ని పరిస్థితులను తట్టుకునేలా రాటుదేల్చుతున్నట్లు లక్ష్మణ్ చెప్పాడు.


ప్రతి రాష్ట్రం నుంచి రాడార్‌లో 50 మంది ఆటగాళ్లు:


రాష్ట్ర స్థాయి కోచ్‌లతో కూడా కొలాబరేట్‌ అయ్యి అక్కడి ప్లేయర్ల విషయంలో ఏం చేయగలమో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండడం వల్లే ప్రతి రాష్ట్రం నుంచి భారీగా ప్లేయర్లు వస్తున్నారన్నారు. ZCA, NCA క్యాంప్‌లకు వచ్చే వాళ్లలో అథ్లెట్ల వంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వారి స్కిల్స్‌తో పాటు ఫిట్‌నెస్‌ కూడా ఇంప్రూవ్ చేస్తున్నామన్నారు. ఆ విధంగా ప్రతి రాష్ట్రం నుంచి పాతిక మంది మహిళా ఆటగాళ్లు అదే స్థాయిలో మేల్ ప్లేయర్స్‌ను వాచ్‌ లిస్ట్లో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి డేటాను సేకరించి పదేళ్ల ఫైల్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఇది ఆ ఆటగాళ్ల ప్రోగ్రెస్ రిపోర్టులా ఉంటుందని.. ఆ మేరకు వాళ్ల ప్రతిభకు సాన పెట్టడం జరుగుతుందని చెప్పాడు. జూనియర్ ప్లేయర్ల కోసం వారితో పాటు ఒక మెంటల్‌ టీమ్ పది రోజుల పాటు ఉంటూ వారి మానసిక సన్నద్ధతకు సహాయపడుతుందని చెప్పాడు.


A టీమ్ టూర్లు చాలా ముఖ్యం:


భారత A టీమ్‌ విదేశీ పర్యటనలు భవిష్యత్‌లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఎదురయ్యే పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయని లక్ష్మణ్ చెప్పాడు. అందుకే ఏటా కనీసం రెండు A టీం సిరీస్‌లు ఉండేలా చూస్తున్నామన్నారు. అయితే కొన్ని సార్లు స్థానిక బోర్డులు వాటి డొమెస్టిక్ మ్యాచ్‌ల కోసం ఏ టీంకు జట్టు సభ్యులను అందించలేక పోవచ్చు. అందుకే కనీసం రెండు సిరీస్‌లకైనా ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఆ సిరీస్‌లలో కొందరు ఇంటర్నేషల్ క్రికెట్ ఆడిన వాళ్లు కూడా ఉంటారు కాబట్టి ఆ అనుభవం కొత్త వాళ్లకు ఉపకరిస్తుంది. వాళ్లు ఎప్పుడైనా నేషనల్ టీంకు ఆడినప్పుడు వాళ్లకు అక్కడ ఎదురయ్యే పరిస్థితులు సమర్థంగా ఎదుర్కోవడానికి సాయపడుతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో ఈ విధమైన ప్లేయర్స్ సప్లై చైన్ సిస్టమ్ సమర్ధంగా ఉండడం వల్లే ఒక దశాబ్దం పాటు ప్రపంచ క్రికెట్‌ను ఏలారు. ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా భారత్‌కు అందుబాటులోకి రావడంతో ఒక్క స్థానానికి కనీసం నలుగురు ఎప్పుడూ కంటెండెర్స్‌గా ఉంటున్నారు. ఇది భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసే విషయమని సీనియర్‌లు చెబుతున్నారు.


Also Read: ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్‌ ధోని - కెప్టెన్‌ కూల్ లీగ్‌ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ధర, సీఎస్‌కేకు అన్ని విధాలా లాభం