Lowest Price ever for MS: 2025 ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఎమ్ఎస్ ధోనీ ఆడేందుకు అడ్డంకులు తొలిగాయి. ట్రోఫీతో లీగ్ కేరీర్‌ను ముగించేందుకు మిస్టర్ కూల్‌కు మారిన ఐపీఎల్ రూల్స్ అవకాశం కల్పించాయి. ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రకటించడంతో సీఎస్‌కే 4 కోట్ల రూపాయలకే ధోనీని 2025సీజన్‌లో అంటి పెట్టుకునే అవకాశం వచ్చింది. ఇక ధోనీ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లీగ్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ధర పలకనున్న ధోనీ:
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు చెబితే దేశవ్యాప్తంగా అభిమానుల గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐతే చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్‌కే అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. సీఎస్‌కేకు ఐదు సార్లు టైటిల్స్ అందించాడు. మొత్తం 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేర్చిన ధోనీ ఐదు సార్లు రన్నరప్‌గా నిలిపాడు. ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మిస్టర్ కూల్ రికార్డు సాధించాడు. మధ్యలో రెండేళ్లు ఫ్రాంచైజ్‌పై నిషేధం విధించినప్పుడు రైజింగ్ పూనే సూపర్ జైంట్స్ తరపున ఆడి ఒక సారి ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్ కెరీర్‌లో 264 మ్యాచ్‌ల్లో 229 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ 252 సిక్స్‌లు బాదాడు. మొత్తంగా 5, 243 పరుగులు చేశాడు. ఇక వికెట్ల వెనుక అయితే అద్భుతమే. 152 క్యాచ్‌లు పట్టిన ధోనీ 24 రనౌట్లు, 42 స్టంపింగ్‌లు చేశాడు. వీటిల్లో కొన్ని కళ్లు చెదిరే క్యాచ్‌లు, అద్భుతమైన స్టంపింగ్‌లు, నమ్మశక్యం కాని రనౌట్లు కూడా ఉన్నాయి. ఇంత ఉజ్వలమైన ఐపీఎల్ కెరీర్ ఉన్న ధోనీ ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌లో 9న్నర కోట్ల రూపాయలతో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం 12 కోట్ల రూపాయలతో 2021లో ధోనీని చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. వచ్చే ఏడాది మాత్రం ప్రస్తుత ధరలో మూడో వంతు మాత్రమే చెల్లించి ధోనీని సీఎస్‌కే మరో సీజన్ ఆడించే అవకాశం ఉంది.
2025 ఐపీఎల్‌లో ధోనీని చూడగలమా?:
సీఎస్‌కే లెగసీ బిల్డప్‌లో కీలకమైన ధోనీ 2025 ఐపీఎల్‌లో ఆడేందుకు శనివారం నాటి బసీసీఐ సమావేశం మార్గం సుగమం చేసింది. 2024 సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరగా వచ్చిన ధోనీ కొంత మేర మాత్రమే మెరుపులు మెరిపించాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత గతంలో ఆడినంత ధాటిగా ఆడలేక పోతున్నాడు. ఇంకా వయస్సు కూడా మరో కారణం కావొచ్చు. ఈ క్రమంలో ధోనీకి 12 కోట్ల రూపాయలు వెచ్చించే విషయంలో సీఎస్కే వెనకడుగు వేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ధోనీని వదిలించుకునేందుకు ఫ్రాంచైజ్ యాజమాన్యం ఆలోచిస్తోందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ తరుణంలోనే 2021లో ఆపేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ విధానం మళ్లీ తీసుకురావడం సీఎస్కేకు కలిసి వచ్చింది. ఐదేళ్లు పైబడి అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా, లేదా బీసీసీఐ కాంట్రాక్ట్‌కు ఐదేళ్ల నుంచి దూరంగా ఉన్న వాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా గుర్తిస్తారు.
అంతే కాకుండా ప్రతి టీమ్ రిటెన్షన్ చేసుకునే ఆరుగురు ప్లేయర్లలో ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ కూడా ఉండాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధన కూడా సీఎస్‌కేకు అవకాశంగా మారింది. ఈ క్రమంలో 12 కోట్లు చెల్లించాల్సిన చోట 4 కోట్లు మాత్రమే చెల్లించి ధోనీని సీఎస్‌కే అట్టిపెట్టుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2019 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలయ్యే నాటికి ధోనీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి 5 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. కాబట్టి ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్ అవుతాడు. ఐతే ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా లేదా అన్నది అనుమానాస్పదమే. ఇప్పటికే ధోనీ సహచరుడు సురేశ్‌రైనా ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 సీజన్‌లో ధోనీ ఆడడంటూ ప్రచారం జరిగినా అతడు ఆడాడు. అయితే అనూహ్య నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్య పరిచే ధోనీ.. 2025 ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకునే వరకూ అందరూ వేచి చూడాల్సిందే. ఒక వేళ ధోనీ తదుపరి సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగితే టైటిల్‌తో ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు రుతురాజ్ గైక్వాడ్ టీం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.