Prakash Raj Sensational Tweet On Pawan Kalyan: తిరుమలలో (Tiruamala) లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై ప్రకాష్ రాజ్ (PrakashRaj) వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తప్పుపట్టిన వేళ.. ప్రకాశ్ రాజ్ సైతం దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. లడ్డూ వ్యవహారానికి సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టిందంటూ ఓ న్యూస్ క్లిప్‌ను సైతం ట్వీట్ చేశారు. 'దేవున్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజాగా, ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. 'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!.. కదా.?. ఇక చాలు ప్రజల కోసం చెయ్యాల్సిన పనులు చూడండి.' అంటూ మరో సంచలన ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది. ఇది పవన్‌పై సెటైరికల్‌గానే వేశారనే విమర్శలు వస్తున్నాయి.






ఇదీ జరిగింది


కాగా, ఇటీవల తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు కార్తి 'అది సెన్సిటివ్ అంశం' అంటూ చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. దీనిపై స్పందించిన కార్తి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ 'తప్పు చేయకుండానే క్షమాపణలు చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో.?' అంటూ పవన్‌పై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత 'గెలిచే ముందు ఓ అవతారం.. గెలిచాక మరో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం' అంటూ మరో ట్వీట్ చేశారు. ఇలా వరుస ట్వీట్లతో ప్రకాష్ రాజ్ పవన్‌ను టార్గెట్ చేశారు. అయితే, దీనిపై జనసైనికులు, పవన్ అభిమానులు మండిపడుతున్నారు. 


తిరుమలకు పవన్ కల్యాణ్


మరోవైపు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. లడ్డూ వివాదం క్రమంలో 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన.. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించనున్నారు. అంతకు ముందు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 0ప్రాయశ్చిత్త దీక్ష అనేది కేవలం లడ్డూ కోసం చేసిన దీక్ష మాత్రమే కాదని.. శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష అని అన్నారు. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ చెప్పారు. 'కల్తీ నెయ్యికి సంబంధించి ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారు. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి. కొన్నేళ్లుగా 219 ఆలయాలు ధ్వంసం చేశారు. రామతీర్థం ఆలయంలో ధ్వంసం జరిగింది. ప్రభుత్వం అన్నింటిపైనా విచారణ జరిపిస్తుంది.' అని పవన్ పేర్కొన్నారు. 


Also Read: CM Chandrababu: 'సొంతూరిలోనే ఉద్యోగం చేసుకోవచ్చు' - డీఎస్సీ నోటిఫికేషన్‌పైనా సీఎం చంద్రబాబు కీలక  ప్రకటన