CM Chandrababu Comments In Kurnool: రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని.. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో పెన్షన్ల పంపిణీ అనంతరం నిర్వహించిన గ్రామసభలో ఆయన ప్రసంగించారు. వర్క్ ఫ్రం హోంకు శ్రీకారం చుట్టాలనేదే తన ఆలోచన అని.. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరిలోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని చెప్పారు. 'కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చాం. రూ.100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతాం. ఓర్వకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. దీపావళి రోజు నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తాం. వాలంటీర్లు లేకపోయినా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. వాలంటీర్లను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం.' అని చంద్రబాబు తెలిపారు.










'ఆ విధ్వంసం అంతా ఇంతా కాదు'


గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మీటింగ్స్ అంటే పరదాలు కట్టేవారని.. సీఎం మీటింగ్ అంటేనే ప్రజలకు నరకం కనిపించేదని అన్నారు. 'కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4 వేలకు పెంచాం. ప్రతి నెలా ఒకటో తేదీనే అధికారులు ఇంటికి వచ్చి పింఛన్ అందిస్తున్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తాం. ఒకప్పుడు ఉద్యోగులకు సరిగ్గా జీతాలు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు సకాలంలో జీతాలు అందిస్తున్నాం. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో ఓటు వేశారు. జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలను నెరవేరుస్తున్నాం. గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. రీసర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు. వాటిని సరి చేస్తున్నాం. భూ సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాం. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేదే నా లక్ష్యం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తునకు బ్రేక్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం