Flood Relief Funds To Telugu States: దేశవ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన క్రమంలో ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.5,858.60 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి 14 రాష్ట్రాలకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఏపీకి రూ.1,063 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు కేటాయించింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది. ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, తూ.గో, ప.గో సహా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో తీవ్ర నష్టం సంభవించింది. విజయవాడలో బుడమేరు పొంగడంతో నగరం అతలాకుతలమైంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి బాధితులకు పునరావాస కేంద్రాల ద్వారా సహాయం అందించింది. అటు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెెం జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.
కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాలపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ప్రాథమిక నివేదిక మేరకు తక్షణ సాయంగా ఈ నిధులు కేటాయించింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.