Deputy CM Pawan Kalyan Key Comments On Tirumala Laddu Issue Prayaschtha Deeksha: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఉన్న సమాచారాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) చెప్పారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు బయల్దేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా అనలేదని అన్నారు. నెయ్యి వచ్చిన తేదీల విషయంలో కొద్దిగా అయోమయం ఉందని వారు చెప్పారని పేర్కొన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. 'ప్రాయశ్చిత్త దీక్ష అనేది కేవలం లడ్డూ కోసం చేసిన దీక్ష మాత్రమే కాదు. శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నా. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి. కొన్నేళ్లుగా 219 ఆలయాలు ధ్వంసం చేశారు. రామతీర్థం ఆలయంలో ధ్వంసం జరిగింది. ప్రభుత్వం అన్నింటిపైనా విచారణ జరిపిస్తుంది.' అని పవన్ పేర్కొన్నారు. కాగా, మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న పవన్ కాలినడకన శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు.










సిట్ విచారణకు బ్రేక్


మరోవైపు, తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సిట్ (SIT) దర్యాప్తునకు తాత్కాలికంగా నిలిపేసింది. సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే దాదాపు 4 రోజులుగా లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగింది. దర్యాప్తులో భాగంగా టీటీడీ గోదాములు, పిండిమర, ల్యాబ్‌లను అధికారులు పరిశీలించారు. నెయ్యిని నిల్వ చేసే ట్యాంకర్లనూ సిట్‌ సిబ్బంది పరిశీలించారు. సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టగా సిట్ దర్యాప్తుపై సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అటు, ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.


Also Read: CM Chandrababu: 'సొంతూరిలోనే ఉద్యోగం చేసుకోవచ్చు' - డీఎస్సీ నోటిఫికేషన్‌పైనా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన