ఆరేళ్ల తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'దేవర' (Devara Movie). సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని 'చుట్టమల్లె...' సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. అనిరుద్ మ్యూజిక్, రత్నవేలు కెమెరా వర్క్, థాయిలాండ్ లొకేషన్స్, ఎన్టీఆర్, జాన్విల కెమిస్ట్రీ ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే 'ఆ!' సౌండింగ్ దగ్గర థియేటర్లను లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లాగా మార్చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందరే థియేటర్లో సినిమా చూస్తూ ఆ సెలబ్రేషన్లను వీడియో తీసుకుంటూ మురిసిపోతున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇంత క్రేజ్ వచ్చిన ఆ పాటను షూట్ చేసింది మాత్రం డైరెక్టర్ కొరటాల శివ కాదంటూ ట్విస్ట్ ఇచ్చారు హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వి
థాయిలాండ్‌లో షూట్ చేసిన 'చుట్టమల్లె' సాంగ్!
'దేవర పార్ట్ వన్'లోని 'చుట్ట మల్లె' సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అయితే థియేటర్లలో ఆడియన్స్ కి పూనకాలే తెచ్చేసింది. సాధారణంగా ఎన్టీఆర్ లాంటి సూపర్ డాన్సర్ ఉన్నప్పుడు బాగా ఫాస్ట్ బీట్ పాటలను డిజైన్ చేస్తుంటారు డైరెక్టర్లు. కానీ ఒక స్లో రొమాంటిక్ మెలోడీతో మ్యాజిక్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుద్. ప్రస్తుతం ఈ పాట తారక్ ఫ్యాన్స్ కే కాకుండా మ్యూజిక్ లవర్స్ అందరికీ స్లో పాయిజన్ లా ఎక్కేసింది. ఇక సినిమా ప్రమోషన్ కోసం 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి వెళ్లిన తారక్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
''చుట్టమల్లే' సాంగ్ అంత రొమాంటిక్ గా తీశారు. మీ వైఫ్ ఫీల్ అవుతుందేమో సీన్ మారుద్దామా? అని దర్శకుడికి చెప్పలేదా?' అంటూ హోస్ట్ కపిల్ శర్మ సరదాగా అడగ్గా... ''అసలు ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు డైరెక్టర్ అక్కడ లేరు" అని ట్విస్ట్ ఇచ్చారు ఎన్టీఆర్, జాన్వి. ఆ పాటను థాయిలాండ్‌లో తీశారు. అప్పుడు ఏదో పని మీద కొరటాల అక్కడికి వెళ్లకపోవడంతో కొరియోగ్రాఫర్ ఆ పాటను షూట్ చేశారట. దానితో అంత హిట్ పాటను డైరెక్ట్ చేసింది కొరటాల శివ కాదా అని కామెంట్స్ పెడుతున్నారు ఆడియన్స్.
సినిమాల్లో ఇది సహజమే... పాటలు తీయడానికి దర్శకులు వెళ్లరు!
అయితే ఇది సినిమాల్లో ఎప్పుడూ జరగనది కాదు. ఇలా డైరెక్టర్లు సినిమాకు సంబంధించిన ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు పాటల్లాంటి వాటిని కొరియోగ్రాఫర్లతోనే తీయించేస్తూ ఉంటారు. అయితే షూటింగ్ కి వెళ్లడానికి ముందు కొరియోగ్రాఫర్లు ఆ డ్యాన్స్ మొత్తాన్ని ఆ పాటలో వేసే కాస్ట్యూమ్స్ తో సహా డైరెక్టర్ కు చూపించి ఆయన ఓకే చెప్పిన తర్వాతే షూటింగ్ చేస్తుంటారు. ఇదేమి కొత్తగా జరిగిన విషయం కాదు. కానీ స్వయంగా ఎన్టీఆర్, జాన్వీ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది.
Also Read: దేవర సక్సెస్ మీట్... గురువారం గుంటూరులోని ఆ ఏరియాలో!
బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో..దేవర పార్ట్-1 : మేకర్స్
సినిమా రిలీజ్ అయినప్పుడు కాస్త డివైడ్ టాక్ వచ్చినా దేవర మాత్రం ఎన్టీఆర్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ నే నమోదు చేస్తున్నట్టు మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 80% వరకూ సాధించినట్టు ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఈ వారంలో కూడా గాంధీ జయంతి, ఆపై దసరా సెలవులు వరుసగా రానుండడంతో దేవరకు మంచి నెంబర్సే నమోదు అవుతాయని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. పైపెచ్చు పది రోజులపాటు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెద్ద సినిమా కూడా పోటీ లేదు. ఆపై రజనీకాంత్ కొత్త సినిమా "వేట్టయాన్ " అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. సో అంతవరకూ పండుగ సీజన్లో దేవర మాత్రమే మాస్ ప్రేక్షకులకు మొదటి ఛాయిస్ గా ఉండబోతుంది.
Also Read: ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్... హెల్త్ అప్డేట్ ఇచ్చిన సతీమణి లత