Minister Prashanth Reddy: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలకు ఇలా క్యాంప్ ఆఫీసులు లేవు- మంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు భవన నిర్మాణాలు సీఎం కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రెసిడెన్షియల్, ఆఫీసులను ప్రారంభించిన మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాంపు ఆఫీస్ బయట చేపట్టాల్సిన పనులపై ఆర్ అండ్ బి అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు ఇలాంటి క్యాంపు కార్యాలయాలు లేవని వెల్లడించారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేలకు ఓ కార్యాలయం అనేది లేక ప్రజల సమస్యలపై గెస్ట్ హౌస్ లో మీటింగ్ లు పెట్టుకునే దుస్థితి ఉండేదని చెప్పారు.
అలాంటి సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని చెప్పారు. సకల సౌకర్యాలతో కూడిన అధునాతన భవనాన్ని నిర్మించామని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజలకు ఈ క్యాంపు కార్యాలయం నుంచే మంచి సేవలు అందాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు, ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, నిజామాబాద్ ఆర్అండ్ బి ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, పలువురు అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మోడ్రన్ దోబీ ఘడ్ ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్...
జగిత్యాల జిల్లా మోతె గ్రామం గొల్లపల్లి రోడ్డులో టీయూఎఫ్ఐడీసీ నిధుల ద్వారా 2 కోట్లతో నిర్మించబోయే మోడ్రన్ దోబీ ఘడ్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ... కుల వృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో కులవృత్తులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, హైదరాబాదులో మూడు ఎకరాల స్థలం ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టారని మంత్రి ఈశ్వర్ తెలిపారు. 50 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏ ఒక్కరిని పట్టించుకోలేదని విమర్శించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ అభివృద్ధి ఎందుకు చేయలేని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మంత్రి ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రజకులు, కుమ్మరి, కమ్మరి, గౌడ తదితర కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని వెల్లడించారు. దీనికోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న సీఎం కేసీఆర్ ను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.