Killer Tiger: కిల్లర్ టైగర్‌ను బంధించిన అటవీశాఖ, పులి దాడుల్లో 4 రోజుల్లో ఐదుగురు మృతి
Killer Tiger on Telangana and Maharashtra Border తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో కిల్లర్ టైగర్ దాడుల్లో 4 రోజుల్లో ఐదుగురు తునికా కార్మికులు మృతి చెందారు.

Killer Tiger Trapped | కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులి వరుస దాడులు గిరిజనులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వేసవిలో తునికా ఆకులు సేకరించడానికి అడవులకు వెళ్లే కార్మికులపై పెద్ద పులులు దాడి చేసి దాడి చేస్తున్నాయి. గిరిజనులు తునికా ఆకులు సేకరించడానికి అడవిలోకి వెళ్లగా రెండు రోజుల్లో పులి నలుగురిని చంపింది. అదే పులి ఇటీవల సోమవారం మరో మహిళ ప్రాణాలు తీసింది. దాంతో అటవీ అధికారులు మరింత అప్రమత్తమై పులి కోసం అన్వేషించి సక్సెస్ అయ్యారు. గత నాలుగైదు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన పులిని ఎట్టకేలకు బంధించారు. డోంగర్గావ్ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించారని సమాచారం.
మూల్ తాలూకాలో మరో గిరిజన మహిళ మృతి
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా మూల్ తాలూకాలోని బదురానానికి చెందిన భూమికా బెండర్ (28) సోమవారం ఉదయం తన భర్త ఉదయ్, ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి తునికా ఆకులు సేకరించడానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. ఆకులు సేకరిస్తుండగా, ఒక పెద్ద పులి అకస్మాత్తుగా ఆమెపై దాడి చేయగా... ఆమె కేకలు వేయడంతో, మిగతవారు వెంటనే అప్రమత్తమై అక్కడినుంచి పారిపోయారు. కానీ పులి దాడిలో ఆమె చనిపోయింది. చుట్టుపక్కల వారు గట్టిగా అరవడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది. భూమికా మరణించిన తర్వాత, కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మూల్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి
ఈ నెల 10వ తేదీన, చంద్రపూర్ జిల్లాలోని సింహవా తాలూకాలోని మెండమాల గ్రామానికి చెందిన కూలీలు తునికాను సేకరించడానికి వెళ్లారు. సాయంత్రం వరకు వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వారి ఆచూకీ కోసం వెతికారు. అయితే, కాంత చౌదరి (65), రేఖసిండే (51), శుభంగి చౌదరి (28) అనే ముగ్గురు కూలీల మృతదేహాలను అటవీ సిబ్బంది చార్గావ్ అటవీ ప్రాంతంలోని చెరువు సమీపంలో గుర్తించారు. మే 11న మూల్ తాలూకాలోని నాగోడ గ్రామానికి చెందిన విమలా షిండే (64) అనే మహిళ తునికా సేకరించడానికి వెళ్లి పులి దాడిలో చనిపోయింది. 4 రోజుల్లో ఐదుగురు తునికా కూలీలు చనిపోవడంతో తెలంగాణ సరిహద్దు అటవీ శివార్లలో, మహారాష్ట్రలోని చంద్రపూర్, బల్లార్ష జిల్లాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
తునికా సేకరించడానికి అడవుల్లోకి వెళ్లవద్దు
వేసవి కాలంలో ఆదాయం తెచ్చిపెట్టే తునికా సేకరణను మహారాష్ట్ర అటవీ శాఖ నిలిపివేసింది. చంద్రాపూర్, బల్లార్ష సరిహద్దుల్లో పులుల దాడుల కారణంగా కొన్ని రోజులుగా తునికా సేకరణను నిలిపివేశారు. ఎవర అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని కూలీలను కోరినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులుల వరుస దాడులతో ఏ వైపు దాడి చేస్తుందోనని.. సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు భయంతో గడుపుతున్నారు. పులి ఎక్కడ తమ ప్రాంతంలోకి ప్రవేశిస్తుందేమోనని సరిహద్దులోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు బిక్కుమిక్కుమంటూ గడిపారు.






















